2007/12/23

తొలివ్యక్తిప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. వీరందరిలో మొదటి వ్యక్తి.. నోబెల్ బహుమతి గ్రహీత విలియం రాంట్ జెన్ (1845-1923). జర్మనీకి చెందిన ఈ శాస్త్రవేత్త 1895లో ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా రాంట్ జెన్ పేరు దేశదేశాల్లో మార్మోగిపోయింది. ఈ పరిశోధనపైన ఒక్క ఏడాదిలోనే.. అనేక వ్యాసాలు, పుస్తకాలు ప్రచురితమైనాయి. ఈ నేపధ్యంలో మీడియా కూడా రాంట్ జెన్ కు బ్రహ్మరధం పట్టింది. ఒక శాస్త్రవేత్త పరిశోధనకు.. మీడియా అంత ప్రాముఖ్యతను ఇవ్వటం అదే తొలిసారి.

2007/12/12

ఫెర్మీ ప్రశ్నలు...ప్రశ్నించడం జిజ్ఞాసకు ప్రతీక. ఈ లక్షణం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరికి పెద్దయిన తరువాత కూడా ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. అమెరికా అణుబాంబును అందించిన ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) అలాంటి వాడే. శాస్త్ర సాంకేతిక అంశాలతోపాటు, మనం పట్టించుకోని చిన్న విషయాలపై కూడా ఆయన తనను తాను ప్రశ్నించుకునేవారు. ఓసారి ఆయన ప్రయాణిస్తున్న కారు కిందపడి కొన్ని కుందేళ్లు చనిపోయాయి. ఆ వెంటనే ఫెర్మీ ఆలోచనలు మొదలయ్యాయి. కారు ప్రయాణిస్తున్న వేగం, చనిపోయిన కుందేళ్ల సంఖ్యను బట్టి... ఒక చదరపు మీటర్ వైశాల్యంలో ఎన్ని కుందేళ్లు ఉండి ఉండవచ్చునని లెక్కలు కట్టడం మొదలుపెట్టారు. ఓ పుట్ బాల్ మైదానంలో ఎన్ని గడ్డిపోచలుంటాయి? ఒక పట్టణంలో పియానోలు మరమ్మతు చేసే వాళ్లు ఎంతమంది ఉంటారు? ఇలా ఆయన ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు. చివరకు ఇలాంటి ప్రశ్నలు... 'ఫెర్మీ ప్రశ్నలు'గా పేరొందాయి.

2007/12/06

మంచి మాట - 20నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.

- రామకృష్ణ పరమహంస

2007/12/03

ఘననివాళిసైన్స్ ఆకాశంలో ధృవతారలుగా నిలిచిన శాస్త్రవేత్తలలో జాన్ డాల్టన్ (1766-1844) ఒకరు. పదార్ధం పరమాణు నిర్మితం అన్న విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త డాల్టన్. ఈ బ్రిటీష్ శాస్త్రవేత్త పట్ల ఆయన దేశీయుల్లో గొప్ప అభిమానం ఉండేది. మాంఛెస్టర్ లో డాల్టన్ చనిపోయిన సందర్భంలో ఆ అభిమానం వ్యక్తమయింది. డాల్టన్ పార్ధివ శరీరాన్ని 40 వేల మంది సందర్శించారు. ఆయన అంత్యక్రియలకు వేలసంఖ్యలో హాజరైనారు. అంతేకాదు.. ఆ రోజు మాంఛెస్టర్ నగరంలో అన్ని వ్యాపార సంస్ధలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. తమ ప్రియతమ శాస్త్రవేత్తకు బ్రిటీషర్లు ఈ విధంగా నివాళిని సమర్పించారు.

2007/11/28

మంచి మాట - 19
ఎప్పుడైతే నువ్వు భరతమాతను స్మరిస్తావో, నీ శత్రువుల భయం నిన్ను విడనాడుతుంది

- మహాకవి సుబ్రహ్మణ్యం భారతీయార్

2007/11/24

పొలాల్లో ఐటీకేంద్రంకాలగమనంలో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అంటుంటాం. సిలికాన్ వ్యాలీకి కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలీ ఒకప్పుడు.. పంటపొలాలతో నిండి ఉన్న ప్రాంతం. అదీరోజు.. ప్రపంచ కంప్యూటర్ పరిశ్రమకు రాజధానిగా మారిపోయింది. దీని వెనకాల విలియం షాక్లీ (1910-1989) కృషి ఉంది. షాక్లీ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.. ట్రాన్సిస్టర్ ను కనుక్కున్నది ఈయనే. కాలిఫోర్నియాకు సిలికాన్ టెక్నాలజీని షాక్లీ మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ఆ ప్రాంతంలో సిలికాన్ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేలా తన విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చారు. ఇలా మొదలైన పరిశ్రమలు.. 1960, 70లలో విపరీతంగా పెరిగిపోయి.. ఆ ప్రాంతం తీరుతెన్నులే మారిపోయాయి. క్రమంగా సిలికాన్ వ్యాలీ అన్న పేరు వచ్చింది.

2007/11/21

మంచి మాట - 18
నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు

- ధీరూభాయి అంబానీ

2007/11/15

క్వార్జ్ పేరడీసాహిత్యంలో పేరడీలకు లోటేమీ లేదు. ప్రసిద్ధ కవుల కవితల పైనా, పాటల పైనా పేరడీలు కట్టి.. పదిమందీ నవ్వుకోవటం సాధారణంగా జరిగే పనే. ఇటువంటి ప్రయోగాలు సైన్స్ లోనూ ఉన్నాయి. ప్రాధమిక కణాల్లో ఒకటైన క్వార్జ్ ను కనుక్కున్నందుకు అమెరికా శాస్త్రవేత్త ముర్రె గెల్ మన్(1929) కు నోబెల్ బహుమతి లభించింది. ఆ సందర్భంగా, విలేకరుల సమావేశం ఏర్పాటైంది. చాలామంది శాస్త్రవేత్తలున్నారు కదా.. మీకే బహుమతి లభించటానికి కారణమేమిటి.. అని ఒక పాత్రికేయుడు గెల్ మన్ ను ప్రశ్నించారు. దానికి ఆయన చెప్పిన సమాధానానికి.. కొందరు నవ్వుకుంటే.. కొందరేమో ఇంత పొగరా అని ముఖం చిట్లించుకున్నారు. ఇంతకూ గెల్ మన్ చెప్పిందేమిటంటే.. "నా చుట్టూ మరుగుజ్జులే ఉన్నారు. అందుకే నేనీ ప్రైజ్ గెల్చుకున్నా" అని. న్యూటన్ (1643-1727) అన్న మాటలకు పేరడీగా ఆయన అలా అన్నారు. "మహామహుల భుజాల మీద నిల్చొన్నా కాబట్టే.. ఇతరుల కంటే కాస్త ముందుకు చూడగలుగుతున్నా" అన్న న్యూటన్ ప్రసిద్ధ వ్యాఖ్య తెలిసిందే కదా!

2007/11/13

మంచి మాట - 17


ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే..

- థామస్ కార్లెల్

2007/11/08

20 ఏళ్ల ఆలస్యం అయింది.. అయితే ఏంటి?


ఒక్కోసారి మన కళ్లు మననే మోసం చేస్తుంటాయి.. దారిలో ఓ వజ్రం కనిపించినా.. ఆ.. గాజుముక్కే మోలే.. అనుకుని దాని పక్కనుంచి నడిచివెళ్తాం. శాస్త్రపరిశోధన రంగంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. స్వీడన్ కు చెందిన రసాయనశాస్త్రవేత్త స్వాంటీ అర్హీనియస్ (1859-1927), విద్యార్ధిగా ఉన్న రోజుల్లో.. పీహెచ్.డీ. కోసం ఒక ధీసిస్ రాశారు. దానిని ప్రముఖ రసాయనశాస్త్రవేత్త పెర్ టియేడర్ క్లివ్ (1840-1905) పరిశీలించారు. క్లివ్.. ఏ లోకంలో ఉన్నారోగానీ.. దానికి పీహెచ్.డీ. ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే, ఇరవై ఏళ్ల తర్వాత విచిత్రంగా.. ఆ ధీసిస్ కే నోబెల్ బహుమతి వచ్చింది. ఇంకా విచిత్రమేమంటే.. రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం వచ్చిన ఎంట్రీల్లో అర్హీనియస్ సిద్ధాంతాన్ని ఎంపిక చేసింది స్వయంగా.. క్లివే.

2007/11/05

మంచి మాట - 16

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
- స్వామీ వివేకానంద

2007/10/31

ఈ రోజు జాతీయ సమైక్యతా దినం...!


ఈ రోజు జాతీయ సమైక్యతా దినం.. సర్దార్ వల్లభభాయి పటేల్ (1875-1950) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పటేల్ 31.10.1875న గుజరాత్ లో జన్మించాడు. బార్డోలీ సత్యాగ్రహ సమయంలో 1928లో గాంధీజీ పటేల్ ను 'సర్దార్' అని సంబోధించారు. 1931లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. సుమారు 540 సంస్ధానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఈయన మొదటి ఉపప్రధానిగా, హోం మంత్రిగా పని చేశారు. 15.12.1950న మరణించాడు. ఈయనకు 'ఉక్కుమనిషి', 'ఇండియన్ బిస్మార్క్' అనే బిరుదులున్నాయి. 1991 లో 'భారతరత్న' ప్రదానం చేసారు.

2007/10/29

మంచి మాట - 15జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.

- ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్

2007/10/24

నేను చాలా తప్పు చేశాను..!


"నేను చాలా తప్పు చేశాను.. ఆ కణం అసలు ఉనికిలోనే లేదు.. అసలుండదు కూడా. నా అంచనా తప్పు!" - అస్ట్రియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్ గ్యాంగ్ పౌలి (1900-1958) మాటలు ఇవి. ఈ విశ్వంలో.. ద్రవ్యరాశి లేని, ఆవేశం లేని ఒక కణం ఉందని పౌలి 1931లో ప్రతిపాదించారు. అయితే, ఆ కణానికి సంబంధించిన ఆధారాలు మచ్చుకు కూడా కనిపించకపోవటంతో.. తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. ఆ సందర్భంలోనే.. నేను చెప్పింది తప్పు అని బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఆయన అంచనా తప్పుకాదని సైన్స్ నిరూపించింది. పౌలి ప్రతిపాదనను మరింత అభివృద్ధి పరుస్తూ.. ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) ఆ అజ్ఞాత కణాల గురించి మరిన్ని వివరాలు పేర్కొన్నారు. అంతేగాక.. దానికి న్యూట్రినో అన్న పేరు కూడా పెట్టారాయన. అనంతర కాలంలో వివిధ శాస్తవేత్తలు మూడురకాల న్యూట్రినోలను ఆవిష్కరించారు.

2007/10/21

మంచి మాట - 14
మనసు ఎదుగుతున్న కొద్దీ శరీరం దానంతటదే సహకరిస్తుంది. శరీరం సహకరించని నాడు మనసు బాగలేదని అర్ధం.- సిగ్మండ్ ఫ్రాయిడ్

2007/10/17

యురేకా! ...... మళ్లీ యురేకా!సైన్స్ చరిత్రలో 'యురేకా' అన్న పదానికి చాలా ప్రాధాన్యత ఉంది. స్నానం చేస్తున్న ఆర్కిమెడిస్ (c. 287 BC – c. 212 BC) బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరవడంతో వంటిమీద బట్టలు కూడా లేని విషయాన్ని చూసుకోకుండా.. వీధిలోకి యురేకా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. యురేకా అంటే.. గ్రీక్ లో నేను కనుక్కున్నానని అర్ధం. వస్తువులు నీళ్లలో ఎందుకు తేలుతాయి అన్న విషయంపై ఆర్కిమెడిస్ పరిశోధనలు నిర్వహిస్తున్న కాలంలో ఈ సంఘటన అందరికీ తెలిసిందే. అయితే, ఆధునిక కాలంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగిన విషయమే చాలామందికి తెలియదు. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ వాల్టన్, జాన్ కొక్ రఫ్ట్ 1932లో ఒక యంత్రాన్ని తయారుచేశారు. దీనిద్వారా.. పరమాణువును చేధించవచ్చు. ఈ యంత్రం ద్వారా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు.. వాల్టన్, రఫ్ట్ ఇద్దరూ.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం బయటికి వచ్చి.. యురేకా అంటూ వీధుల్లో ఎగిరి గంతులేశారు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్లను పట్టుకొని.. "మేం పరమాణువును చేధించాం!" అంటూ కేకలు పెట్టారు.

2007/10/15

మంచి మాట - 13, బ్లాగ్ యాక్షన్ డే స్పెషల్


24ఫ్రేములు, 64కళలు బ్లాగ్ చెప్పినట్లు ఈ రోజు బ్లాగ్ యాక్షన్ డే! అంటే ప్రపంచ పర్యావరణం సంరక్షణ కొరకు బ్లాగర్లందరూ గొంతు కలిపిన రోజు. మంచి టపా రాయాలని ఉన్నది కాని సమయం లేదు, అందుకై నా ఈ టపా బ్లాగ్ యాక్షన్ డేకి అంకితం.

Bloggers Unite - Blog Action Day

మానవుడు ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అంటే ప్రకృతి అతని శరీరం. అతను మరణించకుండా ఉండాలంటే ప్రకృతితో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి.

-మార్క్స్‌

2007/10/10

నోబెల్ ప్రైజ్ కు ఆవగింజపాటి విలువలేదా?నోబెల్ ప్రైజ్, డైనమైట్ ను కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ ప్రైజ్ లను ప్రదానం చేస్తారు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని రక్తపాత రహితంగా, సత్యాగ్రహం-అహింసలే అయుధాలను చేసుకొని పోరాడిన మహాత్మాగాంధీకి ఇవ్వని నోబెల్ శాంతి బహుమతికి గౌరవం ఉన్నదో లేదో తెలియదు కానీ.. నోబెల్ ప్రైజ్ కు శాస్త్రప్రపంచంలో చాలా గొప్ప గౌరవస్ధానంలో ఉన్నది. ప్రతి శాస్త్రవేత్తా.. దాని కోసం కలలుగంటారు. ప్రైజ్ మాట అటుంచి.. నోబెల్ కమిటీ పరిశీలనకు తన పేరు వచ్చినా గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే, అటువంటి అత్యున్నత పురస్కారానికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆవగింజంత విలువ కూడా ఇవ్వకపోవటం గమనార్హం. 1922లో ఐన్‌స్టీన్ కు నోబెల్ బహుమతి లభించింది. అయినప్పటికీ.. తను రోజూ రాసుకునే డైరీలో గానీ.. తరచుగా మిత్రులకు రాసే ఉత్తరాల్లో గానీ.. ఐన్‌స్టీన్ కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. అంతేకాదు, చాలాసందర్భాల్లో తనకు ఆ ప్రైజ్ వచ్చిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించేవారు కాదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధము కాలంలో ప్రత్యక్ష హింసను చూసిన ఐన్‌స్టీన్, అవకాశం వచ్చినప్పుడు అహింస గురించి, నోబెల్ మాన్(గాంధీజీ) గురించి తప్పక మాటలాడేవారు.

2007 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ సంబరాలు మెదలైనవి, ఇప్పటికే వైద్య(ఆలీవర్ స్మిత్తీస్, మారియో కాపెచ్చి, మార్టిన్ ఇవాన్స్ లకు కలిపి), భౌతిక(అల్బర్ట్ ఫెర్ట్, పీటర్ గ్రూన్ బర్గ్ లకు కలిపి), రసాయన(గెర్హార్డ్ ఎర్టల్) శాస్త్ర విభాగాలకు అవార్డులను ప్రకటించారు (వాటి మర్మ-మరాలు త్యరలో..).

2007/10/07

మంచి మాట - 12అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.

- స్వామీ వివేకానంద

2007/10/04

కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్

మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా చెప్పిన జగదీశ్ చంద్రబోస్ (1858 - 1937), ప్రపంచ ప్రసిద్ది చెందిన 'ది లివింగ్ అండ్ నాన్ లివింగ్'(1902), 'ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్' (1926) అనే గొప్ప సైన్స్ పుస్తకాలు మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ నవల రచన కూడా చేసేవారు. మొట్ట మొదటి బెంగాలి సైన్స్ ఫిక్షన్ నవల 'నిరుద్దెశేర్ కహిని' (1896) అయన రాసినదే. బోస్ మరియు విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ మంచి స్నేహితులు. మంచి స్నేహం మంచికి నాంది అని, ఇరువురి మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చక్కటి సాహిత్యంతో, కవితలతో ఉండేవి. బోస్ కు కర్ణుడి పాత్ర అంటే చాలా అభిమానం, జాలి కూడా అందుకే ఎలాగైనా కర్ణుడి పాత్రను చిరస్మరణీయం చేయాలని రవీంద్రుడిని కోరారు. ఫలితంగా 'కుంతి-కర్ణ సంవాదం' అనే హృద్యమైన పద్యరచన రవీంద్రుడి కలం నుంచి జాలువారింది.

2007/10/02

మంచి మాట - 11


మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
- మహాత్మాగాంధీ

2007/10/01

మంచి మాట - 10

ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

-మదర్ థెరిస్సా


2007/09/26

బేకింగ్ సోడా + డబ్బు లేని వ్యవస్ధ

బెల్జియం రసాయన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ సాల్వే (1838-1922) 21 ఎళ్ళ వయస్సులోనే అనారోగ్యం కారణముగా చదువు మాని, అతని అంకుల్ కెమికల్ ఫ్యాక్టరీలో పనికి చేరినాడు. చేరిన 2 సంవత్సరాలలో, అమ్మోనియా-సోడా తయారీకి ఒక పద్ధతిని (సాల్వే పద్ధతి) కనిపెట్టి చర్రిత సృష్టించినాడు. ప్రపంచములో 70 సాల్వే పద్ధతి ఆధారిత ఫ్యాక్టరీలు ఇంకా పనిచేస్తున్నాయి. సోడియం బయోకార్బనేట్ (బేకింగ్ సోడా) తయారీకి ఒక పద్ధతిని కూడా కనిపెట్టిన సాల్వే కెమిస్ట్రీకే పరిమితం కాలేదు. సమాజాన్ని మార్చటానికి కూడా ఆయన తనదైన రీతిలో ముందుకు వెళ్లారు. ఆర్ధిక సంక్షోభాల పరిష్కారానికీ ఓ నమూనాను సూచించారు. దాని పేరు టెక్నోక్రసీ. సాల్వే.. దీనిని ప్రతిపాదించటమే కాదు.. ఆచరణలో కూడా పెట్టారు. దాని ప్రకారం.. డబ్బును రద్దు చేస్తారు. దానిస్ధానంలో ఒక సంక్లిష్టమైన రుణవ్యవస్ధ ఏర్పాటవుతుంది. అంతే కాదు, 1903లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాల్వే బిజినెస్ స్కూల్ (SBS) ను నెలకొల్పారు. 1930లలో ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు.. ఓ ప్రత్యామ్నాయ ఆర్ధికవ్యవస్ధగా టెక్నోక్రసీ కొద్దికాలంపాటు ఆదరణ పొందింది.

2007/09/23

మంచి మాట - 9


అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు..
- మహాత్మాగాంధీ

2007/09/20

పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర: జంషెట్ జీ (జేఎన్) టాటా గురించి..

సొంతంగా డబ్బు సంపాదించటం - ఇతరుల కోసం సంపదను సృష్టించటం ఈ రెంటి మధ్య తేడా ఉంది. దేశానికే సంపదను సృష్టించి పెట్టిన చరిత్ర టాటాలది. పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర.
భారత పారిశ్రామిక పురోగమనానికి పునాదులు వేసిన టాటా హౌస్ వ్యవస్ధాపకుడు
జంషెట్ జీ నుసుర్ వాన్ జీ (జేఎన్) టాటా (1839-1904), 1839లో పార్శీ మత గురువుల కుటుంబంలో జన్మించారు. 1868లో ఆయన ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధను ప్రారంభించటంతో దేశ పారిశ్రామిక చరిత్రలో కొత్త శకం ఆరంభమైంది. 1874లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని; 1887లో టాటా స్నన్స్ ను నెలకొల్పారు. అప్పట్లోనే ఆయన ప్రపంచంలోని అత్యంత అభివుద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టాలని భావించారు. ఫలితంగా ఏర్పడిందే టిస్కో మరియు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఖనిజ సంపద సమృద్థిగా లభించే బీహార్ లోని సక్చి (ఇప్పుడు జంషెడ్ పూర్ గా మారింది) వద్ద 1907లో టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం(టిస్కో) నెలకొల్పారు. బ్రిటిష్ వలస రాజ్యంలో అందునా ఓ భారతీయుడు ఉక్కు కర్మాగారం నెలకొల్పటం పెద్ద సంచలనమే అయింది. ఆరంభంలో ఈ కంపెనీ సమస్య ఎదుర్కొన్నా, 1912లో తొలి ఉక్కు దిమ్మె కర్మాగారం నుంచి బయటకు వచ్చింది.

ఇంకా జంషెడ్ జీ తన మానస పుత్రికగా భావించి నెలకొల్పిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగుళూరు. ఈ సంస్ధే నేడు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) గా రూపాంతరం చెంది వ్యవస్ధాపకుల కలలను నిజం చేస్తూ, దేశంలో విజ్ఞాన శాస్త్రాభివృద్థికి తోడ్పడుతోంది. జంషెట్ జీ తన ఇద్దరు కొడుకులతో పాటు ఈ సంస్ధకు కూడా తన ఆస్తిలో సమాన వాటా ఇస్తూ వీలునామా రాయడాన్ని బట్టి దీని ప్రాధాన్యాని అర్ధం చేసుకోవచ్చు. భవిష్యత్ భారతంలో ఓ పారిశ్రామిక మహాసామ్రాజ్య నిర్మాణానికి పునాదులు వేసిన జంషెట్ జీ 1904లో యూరోప్ వెళ్ళినప్పుడు అదే ఆయనకు తుది పయనం అవుతుందని ఆనాడు ఎవరూ అనుకోలేదు. జర్మనీలో ఉండగా ఆయన తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. తనకు చివరి రోజులు సమీపించాయని గ్రహించిన జంషెట్ జీ... పక్కనే ఉన్న తన సోదరుడి కుమారుడు రతన్ జీ దాదాభాయ్ తో, సోదరులంతా కలసి టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ప్రగతిపధంలోకి తీసుకువెళ్లాలని కోరారు. టాటాల పేరు మీద కొనసాగటం అంత తేలికైన విషయం కాదని చెబుతూ... "మీరు ఆ పేరుకు మరింత హుందాతనాన్ని జోడించకయినా ఫర్వాలేదు కాని, కనీసం దాన్ని కాపాడండి. పతనం కానివ్వద్దు. నేను వదలి వెళ్తున్న పనిని కొనసాగించండి. ఇప్పటికే చేసిన పనిని మాత్రం చెడగొట్టకండి" అని ఉద్బోధించారు. క్రమేణా ఆరోగ్యం క్షీణించడంతో మే 19న ఆయన రాత్రి నిద్రలోనే అంతిమశ్వాస విడిచారు.

2007/09/17

మంచి మాట - 8ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

- స్వామీ వివేకానంద

2007/09/13

ఐన్‌స్టీన్ మతిమరుపు

గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలే కాదు.. మతిమరుపు కూఢా అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఐన్‌స్టీన్ మతిమరుపును చూద్దాం. సిద్ధాంతాల గొడవలో రోజుల తరబఢి శ్రమించే ఈ మహాశాస్త్రవేత్త సేదదీరేందుకు కొన్ని పనులు చేసేవారు. వీటిలో వయోలిన్ వాయించటం, పిల్లలతో కలసి ఆడుకోవటం ముఖ్యమైనవి. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ఉన్న రోజులో ఒకసారి ఇలాగే ఐన్‌స్టీన్ స్ధానికంగా ఉన్న చిన్నపిల్లల పాఠశాలకు వెళ్లారు. వయోలిన్ వాయించి వారిని సంతోషపెట్టి, వారికొచ్చిన బుల్లిబుల్లి సందేహాలను తీర్చి రోజంతా సరదాగా గడిపారు. ఇక వెళదామని అనుకుంటున్న సమయంలో కొంతమంది పిల్లలు.. "అంకుల్! మీ ఇంటి అడ్రస్ చెప్పరా? మేం కావాలనుకున్నప్పుడు వస్తాం!" అని అడిగారు. అప్పటిదాకా ఎన్నో సందేహాలు తీర్చిన ఐన్‌స్టీన్ ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎంత తన్నుకున్నా ఇంటి అడ్రస్ ఆయనకు గుర్తుకు రాలేదు. చాలాసేపు తంటాలు పడిన తర్వాతగానీ అడ్రస్ చెప్పలేకపోయారు.

2007/09/04

కష్టాల కొలిమి నుంచి వచ్చిన బంగారము ఈ నేచర్ మ్యాగజైన్


ప్రముఖ బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త నార్మన్ లాకిర్ (1836-1920) జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఆ వృత్తిలో కొనసాగుతూనే.. ఆయన సైన్స్ వైపు తన ప్రస్ధానాన్ని ప్రారంభించారు. ఆర్ధిక సమస్యల కారణంగా.. చిన్నతనం లోనే సైనిక కార్యాలయంలో గుమస్తాగా పనికి కుదిరిన నార్మన్.. క్రమంగా అక్కడి మ్యాగజైన్ లను ఎడిట్ చేసే స్ధాయికి చేరుకున్నారు. అనంతరం, "ద రీడర్" అన్న పత్రికలో చేరి.. అక్కడ సైన్స్ డెస్క్ బాధ్యతలను నిర్వహించారు. తర్వాత.. 1869 లో తానే స్వయంగా "నేచర్" అనే పేరుతో ఒక మ్యాగజైన్ ను స్ధాపించారు. ప్రపంచప్రఖ్యాత సైన్స్ జర్నల్ లలో ఒకటిగా నిలిచింది ఈ పత్రిక. అప్పట్లో నార్మన్ రూపొందించిన డిజైన్ తోనే ఎప్పటికీ నేచర్ వెలువడుతోంది.

2007/08/31

మంచి మాట - 7అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

- స్వామీ వివేకానంద

2007/08/28

మీకు తెలుసా: మీ సీటిలో పేలుళ్లు .. మీరు ఏమి చేయాలి

హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లు అత్యంత బాధాకర సంఘటన. ఇది మనందరికి సవాల్ గా నిలిచింది. ఇలాంటి సంఘటనలు పునరావూతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ప్రధానంగా యువతపై ఉంది. వాటిని మన బ్లాగ్గులు చాలా బాగా విశ్లేషించారు. కాని మనం ఏమి చేయాలి.

*గాయపడిన వారికి సాయం చేద్దాం.

*పేలుళ్లు జరిగినప్పుడు మనం ఆప్రమత్తముగా ఉండి, ఒనర్ లేని బ్యాగులు గురించి పోలీసులుకి ఫోను చేద్దాం.

*రాజకీయ బంద్ లకు దూరంగా ఉండి, సంఘిభావం ప్రకటింతము. తీవ్రవాదుల దుశ్చర్యకు అనవసరంగా ప్రాధాన్యం పెరగకుండా చూద్దాం.

*వైద్యశాలకు సహయం చేద్దాం.

*ఐకమత్యానికి అసలు చావన్నదే లేదు, మీకు మేము కూడా ఉన్నాము అని నీ చేయి అసరా ఇవ్వు.

సుమారు కోటిన్నరమంది చూసిన 'యూ ట్యూబ్' వెబ్ సైట్ లోని 'బ్యాటిల్ ఎట్ క్రూగర్' వీడియ్ కధ చూడండి. ఇది ఐకమత్యపు బలాన్ని మరోసారి చాటిన కధ. 'టీమ్ వర్కు' కు సాదించిన విజయం. ఈ కధ గురించి ఈనాడు లో కూడా వచ్చింది, చదవండి.

దున్నపోతుల సమాజం మేలుకుంది. తోటి జీవిపై జరిగిన దాడి వాటిని స్పందింపజేసింది. ప్రతీకారేచ్ఛ రగిలింది. కొమ్ముల్లోకి కొత్తశక్తి ప్రవాహించింది. ఆలోంచి, ఒక్కొక్కటే కదిలాయి. పక్కా ప్రణాళికతో నడుస్తున్నట్టుగా.. సమర్ధుడైన నాయకుడు దారిచూపుతున్నట్టుగా.. సూన్-జు యుద్ధకళ( ఆర్ట్ ఆఫ్ వార్) కు తామే స్ఫూర్తి అయినట్టుగా.. పదులకొద్దీ దున్నలు. సింహుల తుక్కు రేగ్గొట్టాయి.. చూడండి.చివరిగా: దున్నపోతుల సమాజం మేలుకుంది, మన సమాజం ఎప్పుడూ మేలుకుంటుంది. ఆది త్వరలో మనం చూడాలి అని అశిస్తూ .. మీ మరమరాలు.

సైన్స్ మరమరాలు: సైన్స్ అండ్ కల్చర్

మన దేశం గర్వించదగ్గ భౌతికశాస్త్రవేత్త మేఘనాధ్ సాహాకు శ్లోకాలంటే చాలా ఇష్టం. వాటిని శ్రావ్యంగా ఆలపించేవారు. సాహాకు పఠనాసక్తి కూడా ఎక్కువ. 'సైన్స్ అండ్ కల్చర్' అన్న పేరుతో ఒక సైన్స్ పత్రికను కూడా ఆయన నడిపారు. ఆ పత్రిక ద్వారా.. ప్రజల్లో శాస్త్రీయభావాల వ్యాప్తికోసం ప్రయత్నించేవారు.

2007/08/19

సైన్స్ మరమరాలు: ఒక్కసారిగా చరిత్రలోకి!
ఒక్కటంటే ఒక్క పరిశోధనతో శాస్త్ర ప్రపంచంలో చిరస్ధాయిగా నిలిచిపోవడం అన్నది చాలా అరుదు. వెర్నెర్ హైసన్ బర్గ్, సత్యేంద్రనాధ్ బోసులు ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలోకి చేరతారు. 27 ఏళ్ల వయసులో హైసన్ బర్గ్ (1901-1976) "On the Perceptual Content of Quantum Theoretical Kinematics and Mechanics" పేరుతో తొలి పరిశోధన పత్రం ప్రచురించారు. 1927 లో ప్రచురించిన ఈ పత్రంలోని అంశమే.. హైసన్ బర్గ్ అనిశ్చితి సూత్రంగా స్ధిరపడిపోయింది. 1924 లో భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోసు (1894-1974) తాను ప్రతిపాదించిన "Planck's law and the Light Quantum Hypothesis" సిద్ధాంతాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టైన్ కు పంపారు. ఆ సమయంలో తాను చరిత్రలో నిలిచిపోయే పని ఒకటి చేశానని బోసుకు సైతం తెలియదు. బోసు పంపిన ప్రతిపాదనే... భౌతికశాస్త్రంలో అతికీలకమైన Boson అన్న దృగ్విషయానికి కారణమైంది..

2007/08/14

సైన్స్ మరమరాలు: రామన్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

1930 లో భౌతికశాస్త్రంలో సి.వి.రామన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆ ఏడాది ప్రైజ్ కచ్చితంగా తనకే వస్తుందన్న నమ్మకం ఉన్న రామన్.. ఫలితాలు వెలువడకముందే.. స్వీడన్ లో జరిగే నోబెల్ బహుమతుల ప్రదానోత్సవానికి తనకూ, తన భార్యకు స్టీమర్ లో సీట్లు బుక్ చేసేశారు. ఇక, బహుమతినందుకుంటున్న సమయంలో.. రామన్ కళ్లు చెమర్చాయి. ఆనందంతో కాదు.. బాధతో. ఆ సమయంలో కూడా.. తనపక్కన బ్రిటన్ జెండా చూసి.. తనదేశానికి ఒక జెండా లేకపోయిందే అన్న బాధతో ఆయన హృదయం క్షోభించింది. రామన్, మీకు 60 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

2007/08/13

మంచి మాట - 6శాంతి నీ ఆత్మలోనే ఉంది. దాని కోసం బయట వెతకొద్దు.
- గౌతమ్ బుద్ధుడు

2007/08/12

సైన్స్ మరమరాలు: లెక్కలే సర్వస్వం

ఒక రంగంలో విపరీతమైన ఇష్టం ఉన్నవారికి ఇక వేరే వాటి గురించి ఏమాత్రం పట్టదు. దానిద్వారా ఎన్ని నష్టాలు సంభవిస్తున్నా.. తమ ధోరణిని మార్చుకోరు. ఇటువంటి వారు చాలా అరుదు. వారిలో.. ప్రఖ్యాత భారతీయ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ (1887-1920) ఒకరు. లెక్కల్లో తన తరగతికన్నా ఎంతో పెద్దవారికి సైతం పాఠాలు చెప్పగల రామానుజన్.. ఇతర సబ్జెక్టుల్లో మాత్రం పాస్ మార్కులు కూడా తెచ్చుకునేవారు కాదు. ఫలితంగా.. ఆయన కనీసం డిగ్రీ కూడా సాధించలేకపోయారు. అయితే, ఆయన ప్రతిభను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. గణితశాస్త్రానికి రామానుజన్ చేసిన సేవలను గుర్తిస్తూ..బీఏ డిగ్రీని ఇచ్చి గౌరవించింది.

2007/08/11

మంచి మాట - 5

క్షమాగుణం బలహీనత కాదు. క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి.
- మహాత్మాగాంధీ

2007/08/10

సైన్స్ మరమరాలు: అనాథ నక్షత్రాలు

ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర సుబ్రహ్మణ్యం (1910-1995) మరణించినప్పుడు.. "విశ్వంలోని నక్షత్రాలన్నీ అనాథలయ్యాయి" అని ప్రపంచ పత్రికలు రాశాయి. దీని వెనక ఒక నేపథ్యం ఉంది. చంద్రశేఖర్ ను ఒక సందర్భంలో ఓ విలేకరి ఇంటర్వ్యూ చేశారు. ఆయన సిధ్ధాంతాలు, పరిశోధనల గురించి అడిగిన తర్వాత వ్యక్తిగత విషయాల పై దృష్టి సారించారు. మీకు ఎంత మంది పిల్లలు అని అడిగారు. దానికి సరదాగా జవాబిస్తూ.. అనంత విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ నా సంతానమే! అని చంద్రశేఖర్ చెప్పారు. వాస్తవమేమిటంటే ఆయనకు సంతానం లేదు. ఈ ఇంటర్వ్యూ అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా చంద్రశేఖర్ చెప్పిన సరదా సమాధానం చాలామంది శాస్త్రవేత్తలకు ఆసక్తిదాయకమైంది. తర్వాత ఆయన మరణించినప్పుడు.. నక్షత్రాలు అనాధలయ్యాయంటూ చంద్రశేఖర్ కు పత్రికలు నివాళులు అర్పించాయి..

2007/08/09

మంచి మాట - 4

మనం మన కోసం చేసేది మనతోనే ఆంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది.
- మహాత్మాగాంధీ

మంచి మాట - 3

స్నేహమంటే రెండు శరీరాల్లో నివసిస్తున్న ఒకే ఆత్మ
- అరిస్టాటిల్

మంచి మాట - 2

నిన్ను నువ్వు నీ శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకో. నీలో నీకు కన్పిస్తున్న వాడికంటే గొప్ప మిత్రుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు.
- జెరిమీటేలర్

2007/08/08

మంచి మాట - 1

మంచి తల్లి వందమంది ఉపాధ్యాయులతో సమానం
- జార్జ్ హెర్బర్ట్