2009/04/23

జిడ్డు కృష్ణమూర్తి, మంచి మాట - 29
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
-జిడ్డు కృష్ణమూర్తి

2009/04/04

రాజకీయ సభలో అర్ధం కాని మేధావి

అది బ్రిటీష్ పార్లమెంట్ భవనంలోని ప్రధానహాలు. సభ్యులతో నిండి ఉంది. వాడిగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతలో ఒక వ్యక్తి లేచి నిల్చున్నాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఆ వ్యక్తి వైపే అందరి దృష్టీ ఉంది. ఆయన ఏం చెబుతాడా అని చూస్తున్నారు. ఇంతలో ఆయన నోరు మెదపకుండానే తటాలున కూచున్నాడు. సభ యావత్తూ అవాక్కైంది. ఆయన ఎందుకు లేచాడో, ఎందుకు కూచున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. మరుసటి రోజుగానీ వారికి విషయం సృష్టం కాలేదు. బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులను ఆ విధంగా ఆశ్చర్యానికి గురి చేసిన ఆ వ్యక్తి పేరు ఐజాక్ న్యూటన్ (1643-1727).

ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహాడైన న్యూటన్ కు పార్లమెంట్ లో గౌరవ సభ్యత్వం ఉండేది. సభకు క్రమం తప్పకుండా హాజరైనా ఎన్నడూ నోరుమెదిపే వాడు కాదు. తనకు తెలియని విషయాల గురించి మాట్లాడటం సరైంది కాదని న్యూటన్ అభిప్రాయం. ఆయన వ్యవహారశైలికి ఇతర సభ్యులు కూడా అలవాటుపడ్డారు. అటువంటిది ఒకనాడు న్యూటన్ హఠాత్తుగా లేచి నిల్చోవటం, వెంటనే కూర్చోవటం ఏమిటో వారెవరికీ అర్ధం కాలేదు. ఇంతకూ విషయమేమిటంటే, పార్లమెంట్ లో న్యూటన్ ముందు కూచున్న వ్యక్తి పక్కన ఒక కిటికీ ఉంది. దాని రెక్క తెరిచి ఉంటుంది. ఆ సభ్యుడు మాటిమాటికీ లేచి నిల్చొని మాట్లాడుతుంటే... ఆయన తలకు కిటికీ రెక్క ఎక్కడ తగులుతుందో అన్న భయంతో దానిని మూసివేయటానికి న్యూటన్ లేచాడు. కానీ, అందరూ తనవైపే చూడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.