2008/02/23

తెలియని మహత్యం!



"కాశి పట్నం చూడరబాబు... చూడరబాబు" అంటూ జాతర్లలో 'బయోస్కోపు'ల వాళ్లు పాడటం ఇప్పుడు అందరూ మరచిపోయారు. ఈ బయోస్కోపు, శాస్త్ర పరిభాషలో 'కలైడోస్కోప్' ను కనుక్కున్న వ్యక్తి బ్రిటన్ చెందిన ఖగోళ శాస్త్రవేత్త డేవిడ్ బ్రూస్టర్ (1781-1868). సరదా కోసం మొదలు పెట్టి ఆవిష్కరించినా.. కలైడోస్కోప్ ఆ కాలంలో సూపర్ హిట్ అయింది. బ్రూస్టర్ దీని ఆవిష్కరణకు సంబంధించి పేటెంట్ కుడా పొందారు. కాని నిర్మించడం చాలా సులువు కావడం వల్ల బ్రూస్టర్ ప్రమేయం లేకుండా ఈ కలైడోస్కోపులు యూరప్ మొత్తం విస్తరించాయి. బాగా ప్రాచుర్యం పొందిన తరువాత గాని బ్రూస్టర్ కు తన ఆవిష్కరణ మహత్యమేమిటో తెలియలేదు!

2008/02/17

మన దగ్గరకు వచ్చిన సాంకేతిక చైతన్యం 'సైన్స్ ఎక్స్ ప్రెస్'



శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువకులకు ఆసక్తిని పెపొందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వినూత్న రైలు ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' ను అక్టోబరు 31న ప్రధాని మన్మోహన్ సింగ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లు న్యూఢిల్లీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈరైలు దేశవ్యాప్తంగా 57 నగరాలను చుట్టివస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' రైలు ఈరోజు మన రాష్ట్రంలోనికి వచ్చింది. ఈనెల 17 నుంచి 19 వరకు విశాఖలో, 20 నుంచి 22 వరకు విజయవాడలో, 23 నుంచి 27 వరకు సికింద్రాబాద్ లో, 28వ తేదీన గుంటూరులోనూ ఆగుతుంది. మర్నాడు మద్రాసు లోని ఎగ్మూర్ కు బయలుదేరి వెళ్తుంది. విద్యార్ధుల్లో సైన్సు పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

జర్మనీలోని సుప్రసిద్ధ సైన్స్ టన్నెల్ ఎగ్జిబిషన్ తరహాలో రూపొందించిన ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధనలకు సంబంధించి 12 అత్యాధునిక విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక విభాగం, భారతీయ రైల్వే, జర్మనీకి చెందిన విద్యాశాఖ, పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ సొసైటీ నిర్మించినది ఈ ప్రత్యేక రైలు. జర్మనీలో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో లభిస్తున్న అవకాశాలను యువకులకు వివరించడం కోసం ఒక ప్రత్యేక బోగీని రూపొందించారు. జర్మనీ రసాయనాల పరిశ్రమ బి.ఎ.ఎస్.ఎఫ్. మరో బోగీని 'కిడ్స్ ల్యాబ్'గా రూపొందించింది. ఇక్కడ విద్యార్ధులు రసాయనిక శాస్త్ర ప్రయోగాలను స్వయంగా నిర్వహించవచ్చు.

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం, రిజిస్ట్రేషన్ చేయించుకోదల్చుకున్న వారు 9849908669 (విశాఖ), 9849908668 (విజయవాడ), 9849908666 (సికింద్రాబాద్) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

2008/02/05

శాస్త్రాభిమానం


మామూలుగా రాజులు, చక్రవర్తులు అనగానే యుద్ధాల్లో మునిగి తేలేవారనో, సుఖాల్లో ఓలలాడేవారనో మనకు అనిపిస్తుంది. చరిత్రలో దీనికి కోకొల్లలుగా సాక్ష్యాలున్నాయి కాబట్టే ఈ అభిప్రాయం స్ధిరపడిపోయింది. అయితే, కొద్దిమంది మాత్రం ఈ జాబితాలోకి ఎక్కరు. వారిలో ఫ్రెంచ్ పాలకుడు నెపోలియన్ (1769-1821) ఒకరు. ఈ ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తికి గణితం అన్నా, సైన్స్ అన్నా విపరీతమైన అభిమానం. ఈ అభిమానానికి తన దేశం, పరదేశం అన్న పరిమితులు కూడా ఉండేవి కావు. ఎక్కడ మంచి ఆవిష్కరణ జరిగినా, మంచి పరిశోధన గ్రంధం వెలువడినా ఆ శాస్త్రవేత్తను, రచయితను ఫ్రాన్స్ కు ఆహ్వానించి, ఆదరించి ఆ అంశంమైన మాట్లాడించుకునేవారు నెపోలియన్. వేర్వేరు భాషల్లో ఉన్న శాస్త్రీయ గ్రందాలను ఫ్రెంచ్ భాషలోకి అనువదింపజేసేవారు.