2008/09/09

చిన్న వయసు మేధావిభౌతికశాస్త్ర చరిత్రను మలుపుతిప్పిన మహాశాస్త్రవేత్తల్లో జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్-ప్లాంక్ (1858-1947) ఒకరు. ఈయన ఆవిష్కరించిన క్వాంటం సిద్దాంతం ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. అటువంటి ప్లాంక్ జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇది. ప్లాంక్ చాలా చిన్నవయస్సులోనే మేధావిగా గుర్తింపు పొందారు. కీల్ (జర్మనీ) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరేప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్లే. కొత్తవాళ్లెవరైనా చూస్తే... ఆయన అక్కడ అధ్యాపకుడంటే నమ్మేవారు కాదు. ఒకసారి విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దానిలో ప్లాంక్ ఉపన్యసించాల్సి ఉంది. దానికి హాజరు కావటానికి హడావిడిగా బయలుదేరారు. అయితే, ఆ తొందరలో సదస్సు జరిగే హాలు ఎక్కడుందో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. దానితో అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని పట్టుకొని.. "మాక్స్-ప్లాంక్ ఉపన్యసించే సదస్సు ఏ హాల్లో జరుగుతుంది?" అని ప్రశ్నించారు. ఆ కొత్తవ్యక్తికి ప్లాంక్ సిద్ధాంతాల గురించి తెలుసుగానీ.. ఆయనను స్వయంగా ఎప్పుడూ చూడలేదు. దానితో ప్లాంక్ ను ఎగాదిగా చూస్తూ.. "నీకు అక్కడేం పని? ఆ మేధావి ప్రసంగాన్ని అర్ధం చేసుకునే వయసు కాదు నీది!" అన్నారు. వస్తున్న నవ్వును ఆపుకొని మాక్స్-ప్లాంక్ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి.. తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకొని సదస్సు జరిగే హాలువైపు తీసుకెళ్లాడు ప్లాంక్ ను.

చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా బ్లాగులో ఈ టపా రాస్తున్నాను. ఈమధ్య నాకు మాక్స్-ప్లాంక్ ల్యాబరేటరీ ఇచ్చిన పీహెచ్.డీ. డిగ్రీ చేతపట్టుకొని టోక్యో విశ్వవిద్యాలయంలో చేరేసరికి ఇన్ని రోజులు అయినది. నా టపా కోసం ఎదురుచూసిన వారికి ధన్యవాదాలు.