2009/04/23

జిడ్డు కృష్ణమూర్తి, మంచి మాట - 29
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
-జిడ్డు కృష్ణమూర్తి

2009/04/04

రాజకీయ సభలో అర్ధం కాని మేధావి

అది బ్రిటీష్ పార్లమెంట్ భవనంలోని ప్రధానహాలు. సభ్యులతో నిండి ఉంది. వాడిగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతలో ఒక వ్యక్తి లేచి నిల్చున్నాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఆ వ్యక్తి వైపే అందరి దృష్టీ ఉంది. ఆయన ఏం చెబుతాడా అని చూస్తున్నారు. ఇంతలో ఆయన నోరు మెదపకుండానే తటాలున కూచున్నాడు. సభ యావత్తూ అవాక్కైంది. ఆయన ఎందుకు లేచాడో, ఎందుకు కూచున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు. మరుసటి రోజుగానీ వారికి విషయం సృష్టం కాలేదు. బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులను ఆ విధంగా ఆశ్చర్యానికి గురి చేసిన ఆ వ్యక్తి పేరు ఐజాక్ న్యూటన్ (1643-1727).

ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహాడైన న్యూటన్ కు పార్లమెంట్ లో గౌరవ సభ్యత్వం ఉండేది. సభకు క్రమం తప్పకుండా హాజరైనా ఎన్నడూ నోరుమెదిపే వాడు కాదు. తనకు తెలియని విషయాల గురించి మాట్లాడటం సరైంది కాదని న్యూటన్ అభిప్రాయం. ఆయన వ్యవహారశైలికి ఇతర సభ్యులు కూడా అలవాటుపడ్డారు. అటువంటిది ఒకనాడు న్యూటన్ హఠాత్తుగా లేచి నిల్చోవటం, వెంటనే కూర్చోవటం ఏమిటో వారెవరికీ అర్ధం కాలేదు. ఇంతకూ విషయమేమిటంటే, పార్లమెంట్ లో న్యూటన్ ముందు కూచున్న వ్యక్తి పక్కన ఒక కిటికీ ఉంది. దాని రెక్క తెరిచి ఉంటుంది. ఆ సభ్యుడు మాటిమాటికీ లేచి నిల్చొని మాట్లాడుతుంటే... ఆయన తలకు కిటికీ రెక్క ఎక్కడ తగులుతుందో అన్న భయంతో దానిని మూసివేయటానికి న్యూటన్ లేచాడు. కానీ, అందరూ తనవైపే చూడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

2009/03/21

స్వామీ వివేకానంద, మంచి మాట - 28


వినయంలేని విద్య,
సుగుణం లేని
రూపం,
సుదుపయోగం కాని
ధనం,
శౌర్యంలేని
ఆయుధం,
ఆకలి లేని
భోజనం,
పరోపకారం చేయని
జీవితం వ్యర్ధమైనవి.
- స్వామీ వివేకానంద

2009/03/08

వివక్షకు గురి అయిన ప్రఖ్యాత మహిళ శాస్త్రవేత్త: మహిళా దినోత్సవ సందర్భంగా...


పురుషులతో పాటు స్త్రీలూ సమానం అనే అర్ధం వచ్చేవిధంగా... ఆకాశంలో సగం మహిళలదే అంటూంటాం. అయితే, ఈ సమానత్వం రావటానికి ముందు మహిళాలోకం తీవ్రమైన వివక్షను ఎదుర్కొంది. అదీఇదని కాదు.. అన్ని రంగాల్లోనూ ఈ అసమానత్వం రాజ్యమేలింది. దీనికి ఒక ఉదాహరణ.. సోఫీజర్మేన్ (1776-1831) జీవితం. సోఫీ ప్రఖ్యాత ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త. అయితే, ఆమె పరిశోధన పత్రాలను, వ్యాసాలను తన పేరుతో రాసేవారు కాదు. తన పేరు తెలిస్తే.. పురుషాధిక్య సమాజం రుకోదని భయపడి.. ఎమ్. లెబ్లాంక్ అనే మారు పేరుతో వ్యాసాలను రాసేవారు. ఇతర శాస్త్రవేత్తలకు రాసే.. ఉత్తరాల్లోనూ ఆమె ఈ పేరునే ఉపయోగించేవారంటే.. ఆనాటి పరిస్ధితలు ఎంత తీవ్రంగా ఉండేవో వూహించుకోవచ్చు.. ఏదిఏమైనా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలు.

2009/01/12

వికాసానికి 10 వివేకాలు, వివేకానంద జయంతి సందర్భంగా...

వివేకానంద జయంతి సందర్భంగా, చదువు... కెరీర్... జీవితం... అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి స్వామీ వివేకానంద సూచించిన 'కోటబుల్ కోట్స్' మీకోసం.

1. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

2. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

3. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

4. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

5. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

6. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

7. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

9. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.

10. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.