2008/10/26

మాతా అమృతానందమయి, మంచి మాట - 25తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
- మాతా అమృతానందమయి


2008/10/19

నోబెల్ ప్రైజ్ కు సంబధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు - 1


శాస్త్ర ప్రపంచంలో నోబెల్ బహామతికున్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే. ఈ ప్రైజ్ తో ముడిపడిన విశేషాలు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం!


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నోబెల్ బహామతిని అందుకొని చరిత్ర సృష్టించారు. ఆ కుటుంబం మరెవరిదో కాదు.. రేడియం ఆవిష్కర్త
మేడమ్ మేరీక్యూరీ (1867-1934) వాళ్లది. మేరీక్యూరీ ఆమె భర్త పియరీక్యూరీ (1859-1906) 1903లో భౌతికశాస్త్రంలో నోబెల్ గెల్చుకున్నారు. 1911లో మేరీ రసాయనశాస్త్రంలో ఈ ప్రైజ్ ను పొందారు. మేరీ కూతురు, అల్లుడు (ఐరీన్ (1897–1956), ఫ్రెడరిక్ జ్యూలియట్ (1900–1958)) 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ సాధించారు.


మంచి శాస్త్రవేత్త మంచి గురువుగా కూడా ఉంటారు. ఎలక్ట్రాన్ ను కనుక్కున్న
జె.జె. ధామ్సస్(1856-1940) జీవితం దీనికి ఒక ఉదాహరణ. 1906లో ధామ్సస్ నోబెల్ ప్రైజ్ ను అందుకున్న తర్వాత.. ఆయన శిష్యులు ఏడుగురు వరుసగా తర్వాత సంవత్సరాల్లో నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు.


ఎలక్ట్రికల్ రంగానికి చేసిన సేవలకుగాను.. అమెరికా శాస్త్రవేత్తలు
ధామస్ అల్వా ఎడిసన్ (1847–1931), నికొలా టెల్సా (1856–1943)కు కలిపి 1912లో బహామతినివ్వాలని నోబెల్ కమిటీ భావించింది. కానీ, ఎడిసన్ తో తనకున్న విభేదాల దృష్ట్యా.. ఆయనతో కలిసి బహామతిని తీసుకోనని నికొలా భీష్మించుకు కూచున్నారు. దీనితో.. ఆ ఏడాది వేరే శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.


జర్మనీ నియంత హిట్లర్ దురాగతాలకు సాధారణప్రజలే కాదు.. శాస్త్రవేత్తలూ బలయ్యారు. వారిలో ఒకరు..
గెర్హార్డ్ డొమాగ్ (1895–1964). వైద్యరంగంలో ఈయన జరిపిన పరిశోధనలకు 1939లో నోబెల్ బహామతి లభించింది. అయితే, ఆ ప్రైజ్ ను డొమాగ్ స్వీకరించకుండా.. హిట్లర్ కట్టడి చేశాడు. హిట్లర్ పాలన అంతరించాకే.. 1947లో డొమాగ్ తన బహామతిని తీసుకోవాల్సి వచ్చింది.


తండ్రీకొడుకులు, గురుశిష్యులు కలిసి నోబెల్ ప్రైజ్ నందుకున్న సంఘుటనలు కూడా ఉన్నాయి. ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీకి పునాది వేసిన బ్రిటన్ భౌతికశాస్త్రవేత్తలు, తండ్రీకొడుకులు..
విలియంబ్రాగ్ (1862-1942), లారెన్స్ బ్రాగ్ (1890–1971) 1913లో సంయుక్తంగా నోబెల్ గెలుచుకున్నారు. 1902లో లోరెంజ్, తన శిష్యుడు పీటర్ జీమన్ తో కలిసి నోబెల్ ను అందుకున్నారు.
*
.

2008/10/11

మంచి మాట - 24

గమ్యంపట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గంపట్ల కూడా అంత శ్రద్ధ వహించాలి.
- స్వామీ వివేకానంద

2008/10/02

జై జవాన్ జై కిసాన్నేడు మహాత్మాగాంధీ జయంతి అందువల్లన ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఈరోజు మరో మహనీయుడు పుట్టినరోజు కూడా, ఆ మహనీయుడు మన లాల్ బహదూర్ శాస్త్రి (అక్టోబర్ 2 1904 - జనవరి 11 1966).

లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న కాశీకి ఏడు మైళ్ళ దూరంలో వున్న రైల్వే కాలనీలో కాయస్ధ కుటుంబంలో జన్మించారు. ఉత్తరప్రదేశ్ లో కాయస్ధులు మంచి సంస్కారులు, బాగా చదువుకొన్నవారు. ప్రభుత్వంలో అన్ని స్ధాయిలలోనూ వీరికే ప్రాధాన్యత వుండేది. లాల్ బహదూర్ పేరు చివర 'శాస్త్రి' అని వుండుటవల్ల ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వాడని పొరపడటం సహజం, కాని 'శాస్త్రి' అనునది కాశీ విద్యాపీఠం ఇచ్చిన బిరుదు. చదువును లాల్ బహదూర్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. పుస్తకాలు చదవడం ఆయనకు బాగా ఇష్టం. జైలులోనే ఆయన కాంటే, హెగెల్, లాస్కీ, రస్సల్ మొదలైన ప్రసిద్ధ రచయితల గ్రంధాలను మరియు కమ్యూనిస్టు సాహిత్యాన్ని కూడా చదివేవారు. జైల్లో వుండగానే మేడమ్ క్యూరీ జీవిత చరిత్రను ఆయన హిందీలోకి అనువదించారు. బడిలో చదువుకునే రోజుల్లో లాల్ బహదూర్ వేషాలేసేవారు, మహాభారత కధను నాటకమాడినప్పుడు లాల్ బహదూర్ కృపాచార్యుని పాత్రను ధరించాడు. లాల్ బహదూర్ స్కౌట్ ఉద్యమంపై కూడా శ్రద్ధచూపాడు.

1921 జనవరిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి కొందరు జాతీయ భావాలుగల అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆచార్య జీవన్ రావ్ భగవాన్ దాస్, కపలానీ అందులో ఒకరు. స్వరాజ్య పోరాటంలో పాల్గొనమని పెద్ద ఊరేగింపు జరిపారు. లాల్ బహదూర్, త్రిభువన్ నారాయణ సింగ్, అల్లురాయ్ శాస్త్రి మరి ముగ్గురు విద్యార్ధులు హరిశ్చంద్ర హైస్కూలు నుంచి బయటికొచ్చి ఊరేగింపులో చేరిపోయారు. గోపాలకష్ణ గోఖలే, బిపిన్ చంద్రపాల్, సురేంద్ర బెనర్జీ, బాలగంగాధర తిలక్ మొదలైన నాయకుల ఉపన్యాసాలవలన లాల్ బహదూర్ ఉత్తేజితులైనారు.

1927లో లాల్ బహదూర్ మీర్జాపూర్ కు చెందిన లలితాదేవిని పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు పెళ్లికట్నంగా ముట్టినది ఒక రాట్నం, కొన్ని గజాల ఖద్దరు. లాల్ బహదూర్ అంతకుమించి తీసుకొనుటకు ఇష్టపడలేదు. డీ.ఆర్.మాన్కేకర్ లాల్ బహదూర్ శాస్త్రిపై వ్రాసిన పుస్తకంలో శాస్త్రి వ్యక్తిత్వం గురించి ఇలా అంటారు. "పొరపాటు పడితే తక్షణమే క్షమాపణ చెపుతారు. ప్రత్యేకంగా ప్రతి వ్యక్తితోనూ మాట్లాడతారు. గోవింద వల్లభ్ పంత్ వలె జనతా దర్శనం ఇవ్వకుండా ఒక్కొక్కరితో మాట్లాడి గుమ్మందాకా సాగనంపుతారు. తన పాదాలను ఎవ్వర్నీ పట్టుకోనివ్వరు. అఖిల భారత కాంగ్రెస్ సంఘ సమావేశంలో ఆయనెప్పుడో కాని వేదిక మీద కూర్చోరు."

ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త, 1961-66 మధ్య న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి ప్రొఫెసర్ గాల్ బైయిత్ లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇలా అన్నారు- "ఆయన పైకి కనబడినంత మెత్తవారు కాదు. ఆయన మనస్సులో ఉక్కుదనం చాలా వుంది. ఆయన అందరి అభిప్రాయాలను శ్రద్ధగా వింటారు. తరవాత తనొక దృఢమైన నిశ్చయానికి వచ్చాక దానిని మార్చరు."

లాల్ బహదూర్ గాంధేయవాదిగా నిరాడంబర జీవితం గడిపారు. మంత్రిగా వున్నప్పుడు తన హూదాను కూడా మరిచిపోయేవారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ మంత్రిగా వున్నప్పుడు తన నియోజకవర్గం నుంచి కొందరు తనని చూడటానికి వచ్చారు. అప్పుడు లాల్ బహదూర్ ప్రభుత్వ పనిలో నిమగ్నమైయున్నారు. వచ్చినవారు కాసేపు ఎదురుచూసి వెళ్ళిపోయారు. ఇది తెలిసి లాల్ బహదూర్ చాలా బాధపడ్డారు. బస్టాండుకి నడిచి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు.

విలాస జీవితం లాల్ బహదూర్ కు నచ్చేది కాదు. ఉత్తరప్రదేశ్ మంత్రి అయినప్పుడు తన ఇంటిలో ఒక గది ప్రభుత్వం తరపున ఎయిర్ కండిషన్ చేయబడింది. ఇది తెలిసిన లాల్ బహదూర్ ఎయిర్ కండిషన్ తీయించేశారట. మంత్రిగా లేనప్పుడు ఇది ఎక్కడనుండి వస్తుంది? సుఖపడటానికి అలవాటుపడితే తిరిగి కష్టపడలేము అని ఆయన వాదించారట. 1956లో అరియలూర్ లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి ఆయన రైల్వే మంత్రిత్వానికి రాజీనామా చేశారు. ఆ ప్రమాదంలో 144 మంది మరణించారు. అయితే, నెహ్రూ లాల్ బహదూర్ రాజీనామాను అంగీకరించలేదు. కళంకిత వ్యక్తులు రాజకీయ పదవులలో వుండకూడదని లాల్ బహదూర్ గట్టిగా నమ్మారు.

1965 ఏప్రిల్ నెల చివరలో కచ్ లోని రణ్ ప్రాంతంపై పాకిస్తాన్ దురాక్రమణ జరిపింది. మన దేశ గౌరవానికి భంగం రానివిధంగా బ్రిటీష్ ప్రధానమంత్రి రాజీ ప్రతిపాదనలు చేస్తే లాల్ బహదూర్ వెంటనే అమోదించారు. అయితే, కచ్ సంధి ఒప్పందాలు పూర్తికాకుండానే పాకిస్తాన్ ముందుగా సాయుధ దుండగులను, ఆ తర్వాత సైన్యాన్ని కాశ్మీర్ సరిహద్ధులకు పంపించి దురాక్రమణ చేసింది. దేశమంతా ఒక్కటై పాక్ దురాక్రమణను త్రిప్పికొట్టాలని ప్రజలకు "జై జవాన్ జై కిసాన్" అని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన అతి దృఢవైఖరి ప్రశంసనీయం. కాలవ్యవధి చేయకుండా భారత సైన్యాన్ని లాహోర్, సియోల్ కోట రంగాలలో పురోగమించవలసిందిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ రెండు రంగాలలో మన సైన్యం రణభేరి మ్రోగించింది. ఇది పాక్ కు ఒక గుణపాఠం, అప్పటి రష్యా ప్రధాని కోసిగిన్ జోక్యం చేసుకొని శాంతి చర్చలకై మధ్య ఆసియా రిపబ్లిక్ ఉజ్చెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ రావలసినదిగా ఉభయ నాయకులను ఆహ్వానించడం జరిగింది. శాంతి చర్చలు ఫలించినప్పటికీ 1966 జనవరి 11న తాష్కెంట్ లోనే లాల్ బహదూర్ గుండెపోటుతో మరణించారు. యుద్ధంలో పైచేయి వున్నా మనదేశం శాంతినే కోరుకుంటుందని ప్రపంచానికి చాటిన ఘనత లాల్ బహదూర్ దే. వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు.