2007/12/23

తొలివ్యక్తి



ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. వీరందరిలో మొదటి వ్యక్తి.. నోబెల్ బహుమతి గ్రహీత విలియం రాంట్ జెన్ (1845-1923). జర్మనీకి చెందిన ఈ శాస్త్రవేత్త 1895లో ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా రాంట్ జెన్ పేరు దేశదేశాల్లో మార్మోగిపోయింది. ఈ పరిశోధనపైన ఒక్క ఏడాదిలోనే.. అనేక వ్యాసాలు, పుస్తకాలు ప్రచురితమైనాయి. ఈ నేపధ్యంలో మీడియా కూడా రాంట్ జెన్ కు బ్రహ్మరధం పట్టింది. ఒక శాస్త్రవేత్త పరిశోధనకు.. మీడియా అంత ప్రాముఖ్యతను ఇవ్వటం అదే తొలిసారి.

2007/12/12

ఫెర్మీ ప్రశ్నలు...



ప్రశ్నించడం జిజ్ఞాసకు ప్రతీక. ఈ లక్షణం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరికి పెద్దయిన తరువాత కూడా ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. అమెరికా అణుబాంబును అందించిన ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) అలాంటి వాడే. శాస్త్ర సాంకేతిక అంశాలతోపాటు, మనం పట్టించుకోని చిన్న విషయాలపై కూడా ఆయన తనను తాను ప్రశ్నించుకునేవారు. ఓసారి ఆయన ప్రయాణిస్తున్న కారు కిందపడి కొన్ని కుందేళ్లు చనిపోయాయి. ఆ వెంటనే ఫెర్మీ ఆలోచనలు మొదలయ్యాయి. కారు ప్రయాణిస్తున్న వేగం, చనిపోయిన కుందేళ్ల సంఖ్యను బట్టి... ఒక చదరపు మీటర్ వైశాల్యంలో ఎన్ని కుందేళ్లు ఉండి ఉండవచ్చునని లెక్కలు కట్టడం మొదలుపెట్టారు. ఓ పుట్ బాల్ మైదానంలో ఎన్ని గడ్డిపోచలుంటాయి? ఒక పట్టణంలో పియానోలు మరమ్మతు చేసే వాళ్లు ఎంతమంది ఉంటారు? ఇలా ఆయన ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు. చివరకు ఇలాంటి ప్రశ్నలు... 'ఫెర్మీ ప్రశ్నలు'గా పేరొందాయి.

2007/12/06

మంచి మాట - 20



నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.

- రామకృష్ణ పరమహంస

2007/12/03

ఘననివాళి



సైన్స్ ఆకాశంలో ధృవతారలుగా నిలిచిన శాస్త్రవేత్తలలో జాన్ డాల్టన్ (1766-1844) ఒకరు. పదార్ధం పరమాణు నిర్మితం అన్న విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త డాల్టన్. ఈ బ్రిటీష్ శాస్త్రవేత్త పట్ల ఆయన దేశీయుల్లో గొప్ప అభిమానం ఉండేది. మాంఛెస్టర్ లో డాల్టన్ చనిపోయిన సందర్భంలో ఆ అభిమానం వ్యక్తమయింది. డాల్టన్ పార్ధివ శరీరాన్ని 40 వేల మంది సందర్శించారు. ఆయన అంత్యక్రియలకు వేలసంఖ్యలో హాజరైనారు. అంతేకాదు.. ఆ రోజు మాంఛెస్టర్ నగరంలో అన్ని వ్యాపార సంస్ధలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. తమ ప్రియతమ శాస్త్రవేత్తకు బ్రిటీషర్లు ఈ విధంగా నివాళిని సమర్పించారు.