2007/11/28

మంచి మాట - 19
ఎప్పుడైతే నువ్వు భరతమాతను స్మరిస్తావో, నీ శత్రువుల భయం నిన్ను విడనాడుతుంది

- మహాకవి సుబ్రహ్మణ్యం భారతీయార్

2007/11/24

పొలాల్లో ఐటీకేంద్రంకాలగమనంలో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అంటుంటాం. సిలికాన్ వ్యాలీకి కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలీ ఒకప్పుడు.. పంటపొలాలతో నిండి ఉన్న ప్రాంతం. అదీరోజు.. ప్రపంచ కంప్యూటర్ పరిశ్రమకు రాజధానిగా మారిపోయింది. దీని వెనకాల విలియం షాక్లీ (1910-1989) కృషి ఉంది. షాక్లీ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.. ట్రాన్సిస్టర్ ను కనుక్కున్నది ఈయనే. కాలిఫోర్నియాకు సిలికాన్ టెక్నాలజీని షాక్లీ మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ఆ ప్రాంతంలో సిలికాన్ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేలా తన విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చారు. ఇలా మొదలైన పరిశ్రమలు.. 1960, 70లలో విపరీతంగా పెరిగిపోయి.. ఆ ప్రాంతం తీరుతెన్నులే మారిపోయాయి. క్రమంగా సిలికాన్ వ్యాలీ అన్న పేరు వచ్చింది.

2007/11/21

మంచి మాట - 18
నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు

- ధీరూభాయి అంబానీ

2007/11/15

క్వార్జ్ పేరడీసాహిత్యంలో పేరడీలకు లోటేమీ లేదు. ప్రసిద్ధ కవుల కవితల పైనా, పాటల పైనా పేరడీలు కట్టి.. పదిమందీ నవ్వుకోవటం సాధారణంగా జరిగే పనే. ఇటువంటి ప్రయోగాలు సైన్స్ లోనూ ఉన్నాయి. ప్రాధమిక కణాల్లో ఒకటైన క్వార్జ్ ను కనుక్కున్నందుకు అమెరికా శాస్త్రవేత్త ముర్రె గెల్ మన్(1929) కు నోబెల్ బహుమతి లభించింది. ఆ సందర్భంగా, విలేకరుల సమావేశం ఏర్పాటైంది. చాలామంది శాస్త్రవేత్తలున్నారు కదా.. మీకే బహుమతి లభించటానికి కారణమేమిటి.. అని ఒక పాత్రికేయుడు గెల్ మన్ ను ప్రశ్నించారు. దానికి ఆయన చెప్పిన సమాధానానికి.. కొందరు నవ్వుకుంటే.. కొందరేమో ఇంత పొగరా అని ముఖం చిట్లించుకున్నారు. ఇంతకూ గెల్ మన్ చెప్పిందేమిటంటే.. "నా చుట్టూ మరుగుజ్జులే ఉన్నారు. అందుకే నేనీ ప్రైజ్ గెల్చుకున్నా" అని. న్యూటన్ (1643-1727) అన్న మాటలకు పేరడీగా ఆయన అలా అన్నారు. "మహామహుల భుజాల మీద నిల్చొన్నా కాబట్టే.. ఇతరుల కంటే కాస్త ముందుకు చూడగలుగుతున్నా" అన్న న్యూటన్ ప్రసిద్ధ వ్యాఖ్య తెలిసిందే కదా!

2007/11/13

మంచి మాట - 17


ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే..

- థామస్ కార్లెల్

2007/11/08

20 ఏళ్ల ఆలస్యం అయింది.. అయితే ఏంటి?


ఒక్కోసారి మన కళ్లు మననే మోసం చేస్తుంటాయి.. దారిలో ఓ వజ్రం కనిపించినా.. ఆ.. గాజుముక్కే మోలే.. అనుకుని దాని పక్కనుంచి నడిచివెళ్తాం. శాస్త్రపరిశోధన రంగంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. స్వీడన్ కు చెందిన రసాయనశాస్త్రవేత్త స్వాంటీ అర్హీనియస్ (1859-1927), విద్యార్ధిగా ఉన్న రోజుల్లో.. పీహెచ్.డీ. కోసం ఒక ధీసిస్ రాశారు. దానిని ప్రముఖ రసాయనశాస్త్రవేత్త పెర్ టియేడర్ క్లివ్ (1840-1905) పరిశీలించారు. క్లివ్.. ఏ లోకంలో ఉన్నారోగానీ.. దానికి పీహెచ్.డీ. ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే, ఇరవై ఏళ్ల తర్వాత విచిత్రంగా.. ఆ ధీసిస్ కే నోబెల్ బహుమతి వచ్చింది. ఇంకా విచిత్రమేమంటే.. రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం వచ్చిన ఎంట్రీల్లో అర్హీనియస్ సిద్ధాంతాన్ని ఎంపిక చేసింది స్వయంగా.. క్లివే.

2007/11/05

మంచి మాట - 16

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
- స్వామీ వివేకానంద