2007/09/26

బేకింగ్ సోడా + డబ్బు లేని వ్యవస్ధ

బెల్జియం రసాయన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ సాల్వే (1838-1922) 21 ఎళ్ళ వయస్సులోనే అనారోగ్యం కారణముగా చదువు మాని, అతని అంకుల్ కెమికల్ ఫ్యాక్టరీలో పనికి చేరినాడు. చేరిన 2 సంవత్సరాలలో, అమ్మోనియా-సోడా తయారీకి ఒక పద్ధతిని (సాల్వే పద్ధతి) కనిపెట్టి చర్రిత సృష్టించినాడు. ప్రపంచములో 70 సాల్వే పద్ధతి ఆధారిత ఫ్యాక్టరీలు ఇంకా పనిచేస్తున్నాయి. సోడియం బయోకార్బనేట్ (బేకింగ్ సోడా) తయారీకి ఒక పద్ధతిని కూడా కనిపెట్టిన సాల్వే కెమిస్ట్రీకే పరిమితం కాలేదు. సమాజాన్ని మార్చటానికి కూడా ఆయన తనదైన రీతిలో ముందుకు వెళ్లారు. ఆర్ధిక సంక్షోభాల పరిష్కారానికీ ఓ నమూనాను సూచించారు. దాని పేరు టెక్నోక్రసీ. సాల్వే.. దీనిని ప్రతిపాదించటమే కాదు.. ఆచరణలో కూడా పెట్టారు. దాని ప్రకారం.. డబ్బును రద్దు చేస్తారు. దానిస్ధానంలో ఒక సంక్లిష్టమైన రుణవ్యవస్ధ ఏర్పాటవుతుంది. అంతే కాదు, 1903లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాల్వే బిజినెస్ స్కూల్ (SBS) ను నెలకొల్పారు. 1930లలో ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు.. ఓ ప్రత్యామ్నాయ ఆర్ధికవ్యవస్ధగా టెక్నోక్రసీ కొద్దికాలంపాటు ఆదరణ పొందింది.

2007/09/23

మంచి మాట - 9


అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు..
- మహాత్మాగాంధీ

2007/09/20

పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర: జంషెట్ జీ (జేఎన్) టాటా గురించి..

సొంతంగా డబ్బు సంపాదించటం - ఇతరుల కోసం సంపదను సృష్టించటం ఈ రెంటి మధ్య తేడా ఉంది. దేశానికే సంపదను సృష్టించి పెట్టిన చరిత్ర టాటాలది. పోరాటం, సాహాసం, లక్ష్యసాధనల సమ్మేళనమే టాటాల చరిత్ర.
భారత పారిశ్రామిక పురోగమనానికి పునాదులు వేసిన టాటా హౌస్ వ్యవస్ధాపకుడు
జంషెట్ జీ నుసుర్ వాన్ జీ (జేఎన్) టాటా (1839-1904), 1839లో పార్శీ మత గురువుల కుటుంబంలో జన్మించారు. 1868లో ఆయన ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధను ప్రారంభించటంతో దేశ పారిశ్రామిక చరిత్రలో కొత్త శకం ఆరంభమైంది. 1874లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని; 1887లో టాటా స్నన్స్ ను నెలకొల్పారు. అప్పట్లోనే ఆయన ప్రపంచంలోని అత్యంత అభివుద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టాలని భావించారు. ఫలితంగా ఏర్పడిందే టిస్కో మరియు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఖనిజ సంపద సమృద్థిగా లభించే బీహార్ లోని సక్చి (ఇప్పుడు జంషెడ్ పూర్ గా మారింది) వద్ద 1907లో టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం(టిస్కో) నెలకొల్పారు. బ్రిటిష్ వలస రాజ్యంలో అందునా ఓ భారతీయుడు ఉక్కు కర్మాగారం నెలకొల్పటం పెద్ద సంచలనమే అయింది. ఆరంభంలో ఈ కంపెనీ సమస్య ఎదుర్కొన్నా, 1912లో తొలి ఉక్కు దిమ్మె కర్మాగారం నుంచి బయటకు వచ్చింది.

ఇంకా జంషెడ్ జీ తన మానస పుత్రికగా భావించి నెలకొల్పిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగుళూరు. ఈ సంస్ధే నేడు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) గా రూపాంతరం చెంది వ్యవస్ధాపకుల కలలను నిజం చేస్తూ, దేశంలో విజ్ఞాన శాస్త్రాభివృద్థికి తోడ్పడుతోంది. జంషెట్ జీ తన ఇద్దరు కొడుకులతో పాటు ఈ సంస్ధకు కూడా తన ఆస్తిలో సమాన వాటా ఇస్తూ వీలునామా రాయడాన్ని బట్టి దీని ప్రాధాన్యాని అర్ధం చేసుకోవచ్చు. భవిష్యత్ భారతంలో ఓ పారిశ్రామిక మహాసామ్రాజ్య నిర్మాణానికి పునాదులు వేసిన జంషెట్ జీ 1904లో యూరోప్ వెళ్ళినప్పుడు అదే ఆయనకు తుది పయనం అవుతుందని ఆనాడు ఎవరూ అనుకోలేదు. జర్మనీలో ఉండగా ఆయన తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. తనకు చివరి రోజులు సమీపించాయని గ్రహించిన జంషెట్ జీ... పక్కనే ఉన్న తన సోదరుడి కుమారుడు రతన్ జీ దాదాభాయ్ తో, సోదరులంతా కలసి టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ప్రగతిపధంలోకి తీసుకువెళ్లాలని కోరారు. టాటాల పేరు మీద కొనసాగటం అంత తేలికైన విషయం కాదని చెబుతూ... "మీరు ఆ పేరుకు మరింత హుందాతనాన్ని జోడించకయినా ఫర్వాలేదు కాని, కనీసం దాన్ని కాపాడండి. పతనం కానివ్వద్దు. నేను వదలి వెళ్తున్న పనిని కొనసాగించండి. ఇప్పటికే చేసిన పనిని మాత్రం చెడగొట్టకండి" అని ఉద్బోధించారు. క్రమేణా ఆరోగ్యం క్షీణించడంతో మే 19న ఆయన రాత్రి నిద్రలోనే అంతిమశ్వాస విడిచారు.

2007/09/17

మంచి మాట - 8ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

- స్వామీ వివేకానంద

2007/09/13

ఐన్‌స్టీన్ మతిమరుపు

గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలే కాదు.. మతిమరుపు కూఢా అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఐన్‌స్టీన్ మతిమరుపును చూద్దాం. సిద్ధాంతాల గొడవలో రోజుల తరబఢి శ్రమించే ఈ మహాశాస్త్రవేత్త సేదదీరేందుకు కొన్ని పనులు చేసేవారు. వీటిలో వయోలిన్ వాయించటం, పిల్లలతో కలసి ఆడుకోవటం ముఖ్యమైనవి. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ఉన్న రోజులో ఒకసారి ఇలాగే ఐన్‌స్టీన్ స్ధానికంగా ఉన్న చిన్నపిల్లల పాఠశాలకు వెళ్లారు. వయోలిన్ వాయించి వారిని సంతోషపెట్టి, వారికొచ్చిన బుల్లిబుల్లి సందేహాలను తీర్చి రోజంతా సరదాగా గడిపారు. ఇక వెళదామని అనుకుంటున్న సమయంలో కొంతమంది పిల్లలు.. "అంకుల్! మీ ఇంటి అడ్రస్ చెప్పరా? మేం కావాలనుకున్నప్పుడు వస్తాం!" అని అడిగారు. అప్పటిదాకా ఎన్నో సందేహాలు తీర్చిన ఐన్‌స్టీన్ ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎంత తన్నుకున్నా ఇంటి అడ్రస్ ఆయనకు గుర్తుకు రాలేదు. చాలాసేపు తంటాలు పడిన తర్వాతగానీ అడ్రస్ చెప్పలేకపోయారు.

2007/09/04

కష్టాల కొలిమి నుంచి వచ్చిన బంగారము ఈ నేచర్ మ్యాగజైన్


ప్రముఖ బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త నార్మన్ లాకిర్ (1836-1920) జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఆ వృత్తిలో కొనసాగుతూనే.. ఆయన సైన్స్ వైపు తన ప్రస్ధానాన్ని ప్రారంభించారు. ఆర్ధిక సమస్యల కారణంగా.. చిన్నతనం లోనే సైనిక కార్యాలయంలో గుమస్తాగా పనికి కుదిరిన నార్మన్.. క్రమంగా అక్కడి మ్యాగజైన్ లను ఎడిట్ చేసే స్ధాయికి చేరుకున్నారు. అనంతరం, "ద రీడర్" అన్న పత్రికలో చేరి.. అక్కడ సైన్స్ డెస్క్ బాధ్యతలను నిర్వహించారు. తర్వాత.. 1869 లో తానే స్వయంగా "నేచర్" అనే పేరుతో ఒక మ్యాగజైన్ ను స్ధాపించారు. ప్రపంచప్రఖ్యాత సైన్స్ జర్నల్ లలో ఒకటిగా నిలిచింది ఈ పత్రిక. అప్పట్లో నార్మన్ రూపొందించిన డిజైన్ తోనే ఎప్పటికీ నేచర్ వెలువడుతోంది.