2008/12/25

మహాత్మాగాంధీ, మంచి మాట - 27



మనుషులను వారి డీగ్రీలను, మేధోసంపత్తిని చూసి అంచనా వేయకండి. అతని మనసును, ఆలోచనా విధానాన్ని బట్టి అంచనా వేయండి.
- మహాత్మాగాంధీ


2008/12/14

యుద్దం వల్లన సైన్స్ చరిత్రకు జరిగిన అపార నష్టం..



పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి... ముంబయిపై పాక్ ఉగ్రవాదుల దాడి... జరిగిన తరువాత ప్రతి భారతీయుడు పాకిస్ధాన్ పై యుద్దం ప్రకటించాలి అని, ఎన్నాళ్ళిలా అని అడుగుతున్నారు. ఇలాంటి సందర్భములోనే మనం యుద్దం వల్లన సైన్స్ చరిత్రకు జరిగిన అపార నష్టం గురించి మనం చెప్పుకోవాలి.

సైన్స్ ప్రయోగాలు చేసిన ప్రతిసారి యురేకా... అంటూ ప్రఖ్యాత గ్రీకు గణితశాస్త్రవేత్త
ఆర్కిమెడిస్ (క్రీ.పూ. 287-212) జీవితం ఉజ్వలంగా గడిచినప్పటికీ... మరణం మాత్రం అనామకంగా సంభవించింది. ఆ కాలంలో గ్రీకు, రోమన్ నగరాల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. అదేవిధంగా ఒకనాడు సిరాక్యుస్ నగరం పైకి రోమన్లు దండెత్తి వచ్చారు. ఆ నగరంలోనే ఆర్కిమెడిస్ ఉన్నాడు. యుద్ధంలో గ్రీకులు ఓడిపోయారు. దాంతో రోమన్ సైనికులు నగరంలో స్వైరవిహారం ప్రారంభించారు. ఓ సైనికుడు ఆర్కిమెడిస్ ఉన్న భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ఆర్కిమెడిస్ తన అధ్యయనంలో మునిగిపోయి ఉన్నాడు. తన వెంట రమ్మని సైనికుడు ఆదేశిస్తే.. పుస్తకంలోంచి తల పైకెత్తి.. "నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఇప్పుడు అంతరాయం కలిగించకు!" అని ఆర్కిమెడిస్ తిరిగి తన పనిలో పడ్డాడు. దీంతో కోపంతో సైనికుడు కత్తితో పొడిచి ఆర్కిమెడిస్ ను చంపేశాడు. నిజానికి, ఆ సైనికునికి తాను చంపుతున్నది ఓ గొప్ప శాస్త్రవేత్తనని తెలియదు. తర్వాత, ఈ విషయం తెలిసిన రోమన్ కమాండర్ మార్సెల్లెస్ చాలా బాధపడ్డాడు.

2008/12/05

ఐన్‌స్టీన్, మంచి మాట - 26


ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి.
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


2008/11/18

మరపురాని ధీర వనిత, శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా...



శ్రీమతి కమల, జవహర్ లాల్ నెహ్రోల సంతానంగా 1917వ సంవత్సరం నవంబరు 19వ తేదీన జన్మించిన ఇందిరాగాంధీ పెద్దయిన పిమ్మట భారతీయుల ఆరాధ్యదైవంగా రూపొందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. స్విట్జర్లాండ్, బెంగాల్ లోని విశ్వభారతి, ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో విద్యనభ్యసించింది. 1938లో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇందిరాగాంధీ 1941లో భారతదేశపు పూర్తి రాజకీయాలలో ప్రవేశించింది. 1959లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నుకోబడింది. తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచారమంత్రిగా పనిచేసి ఆ శాఖకే వన్నె తెచ్చింది. రేడియో ప్రసారాల నాణ్యతను పెంచే ప్రయత్నం చేసింది. టెలివిజన్ కార్యక్రమాల ప్రాముఖ్యతను గుర్తించిన తొలి నాయకురాలుగా ఈమె విద్యా కార్యక్రమాల కింద కుటుంబ నియంత్రణ పధక అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు.

లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ప్రధానమంత్రి పదవి అధిష్టించి, తొలి మహిళా ప్రధానిగా ఖ్యాతికెక్కింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించింది. కాంగ్రెస్ లోని పెద్దల నెదిరించి స్వతంత్ర అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి వి.వి.గిరిని రంగంలోకి దించి గెలిపించింది. ఇందిరా కాంగ్రెస్ ను స్ధాపించి ఎన్నికలలో తన పార్టీ అఖండ విజయం సాధించేలాచేసి తనదే అసలైన కాంగ్రెస్ పార్టీ అని నిరూపించింది. తర్వాత తన హయాంలో జరిగిన బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో పాకిస్తాన్ తో యుద్ధంలో విజయం సాధించి వీరనారి అనిపించింది. సిక్కింను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇందిరాగాంధీదే! 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖరాన్ లో అమెరికా కన్నుకప్పి అణుపాటవ పరీక్ష చేసి యావత్ ప్రపంచానికి బారత్ సత్తా ఎమిటో చూపినది. అంతేకాదు, దేశంలో పంటల ఉత్పత్తిని పెంచటం ద్వార హరిత విప్లవం సాధించినది. లాల్ బహదూర్ శాస్త్రి పలికిన 'జై జవాన్ జై కిసాన్' మాటలను అచరించి చూపినది.

అధికారం కోల్పోయినప్పుడు కూడా ఈమె ఏమాత్రం జంకలేదు. తిరిగి ఎన్నికలలో మహత్తర విజయంతో ప్రధాని పదవిని అధిరోహించింది. సిక్కులు ప్రత్యేక ఖలిస్ధాన్ కోసం జరిపిన తిరుగుబాటును 'ఆపరేషన్ బ్లూస్టార్' నిర్వహించి సమర్ధవంతంగా అణచివేసింది.
ప్రధానిగా రాజభరణాల రద్ధు, బ్యాంకుల జాతీయం వంటి చర్యలు దేశంలోని పేదవర్గాలనెంతో ఆకర్షించింది. ఆనాడు 'అమ్మ' అంటే ఇందిరాగాంధీయే అని పేద వర్గాలు భావించేవారు. 'గరీబీ హఠావో' నినాదంతో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపింది. 1972వ సంవత్సరం ఈమెకు భారతరత్న అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి జనాభా నియంత్రణ కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించినందులకు ఈమెను 1983లో సత్కరించారు. ప్రతి రాష్ట్రంలోను రవీంద్ర భారతి అను పేర లలితకళల కార్యస్ధాన భవనాలు ఇందిర హయాంలోనే నిర్మించబడ్డాయి.

ప్రజల మనిషిగా పేదవారికి 'అమ్మ'గా వారి హృదయాలలో ప్రతిష్టించబడిన ఇందిరాగాంధీ తన భవనంలో అంగరక్షకులచే తుపాకులతో కాల్చిచంపబడడం దారుణం. ఏది ఏమైనా భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలు.

2008/10/26

మాతా అమృతానందమయి, మంచి మాట - 25



తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
- మాతా అమృతానందమయి


2008/10/19

నోబెల్ ప్రైజ్ కు సంబధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు - 1


శాస్త్ర ప్రపంచంలో నోబెల్ బహామతికున్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే. ఈ ప్రైజ్ తో ముడిపడిన విశేషాలు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం!


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నోబెల్ బహామతిని అందుకొని చరిత్ర సృష్టించారు. ఆ కుటుంబం మరెవరిదో కాదు.. రేడియం ఆవిష్కర్త
మేడమ్ మేరీక్యూరీ (1867-1934) వాళ్లది. మేరీక్యూరీ ఆమె భర్త పియరీక్యూరీ (1859-1906) 1903లో భౌతికశాస్త్రంలో నోబెల్ గెల్చుకున్నారు. 1911లో మేరీ రసాయనశాస్త్రంలో ఈ ప్రైజ్ ను పొందారు. మేరీ కూతురు, అల్లుడు (ఐరీన్ (1897–1956), ఫ్రెడరిక్ జ్యూలియట్ (1900–1958)) 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ సాధించారు.


మంచి శాస్త్రవేత్త మంచి గురువుగా కూడా ఉంటారు. ఎలక్ట్రాన్ ను కనుక్కున్న
జె.జె. ధామ్సస్(1856-1940) జీవితం దీనికి ఒక ఉదాహరణ. 1906లో ధామ్సస్ నోబెల్ ప్రైజ్ ను అందుకున్న తర్వాత.. ఆయన శిష్యులు ఏడుగురు వరుసగా తర్వాత సంవత్సరాల్లో నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు.


ఎలక్ట్రికల్ రంగానికి చేసిన సేవలకుగాను.. అమెరికా శాస్త్రవేత్తలు
ధామస్ అల్వా ఎడిసన్ (1847–1931), నికొలా టెల్సా (1856–1943)కు కలిపి 1912లో బహామతినివ్వాలని నోబెల్ కమిటీ భావించింది. కానీ, ఎడిసన్ తో తనకున్న విభేదాల దృష్ట్యా.. ఆయనతో కలిసి బహామతిని తీసుకోనని నికొలా భీష్మించుకు కూచున్నారు. దీనితో.. ఆ ఏడాది వేరే శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.


జర్మనీ నియంత హిట్లర్ దురాగతాలకు సాధారణప్రజలే కాదు.. శాస్త్రవేత్తలూ బలయ్యారు. వారిలో ఒకరు..
గెర్హార్డ్ డొమాగ్ (1895–1964). వైద్యరంగంలో ఈయన జరిపిన పరిశోధనలకు 1939లో నోబెల్ బహామతి లభించింది. అయితే, ఆ ప్రైజ్ ను డొమాగ్ స్వీకరించకుండా.. హిట్లర్ కట్టడి చేశాడు. హిట్లర్ పాలన అంతరించాకే.. 1947లో డొమాగ్ తన బహామతిని తీసుకోవాల్సి వచ్చింది.


తండ్రీకొడుకులు, గురుశిష్యులు కలిసి నోబెల్ ప్రైజ్ నందుకున్న సంఘుటనలు కూడా ఉన్నాయి. ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీకి పునాది వేసిన బ్రిటన్ భౌతికశాస్త్రవేత్తలు, తండ్రీకొడుకులు..
విలియంబ్రాగ్ (1862-1942), లారెన్స్ బ్రాగ్ (1890–1971) 1913లో సంయుక్తంగా నోబెల్ గెలుచుకున్నారు. 1902లో లోరెంజ్, తన శిష్యుడు పీటర్ జీమన్ తో కలిసి నోబెల్ ను అందుకున్నారు.
*
.

2008/10/11

మంచి మాట - 24

గమ్యంపట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్లే మార్గంపట్ల కూడా అంత శ్రద్ధ వహించాలి.
- స్వామీ వివేకానంద

2008/10/02

జై జవాన్ జై కిసాన్



నేడు మహాత్మాగాంధీ జయంతి అందువల్లన ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఈరోజు మరో మహనీయుడు పుట్టినరోజు కూడా, ఆ మహనీయుడు మన లాల్ బహదూర్ శాస్త్రి (అక్టోబర్ 2 1904 - జనవరి 11 1966).

లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న కాశీకి ఏడు మైళ్ళ దూరంలో వున్న రైల్వే కాలనీలో కాయస్ధ కుటుంబంలో జన్మించారు. ఉత్తరప్రదేశ్ లో కాయస్ధులు మంచి సంస్కారులు, బాగా చదువుకొన్నవారు. ప్రభుత్వంలో అన్ని స్ధాయిలలోనూ వీరికే ప్రాధాన్యత వుండేది. లాల్ బహదూర్ పేరు చివర 'శాస్త్రి' అని వుండుటవల్ల ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వాడని పొరపడటం సహజం, కాని 'శాస్త్రి' అనునది కాశీ విద్యాపీఠం ఇచ్చిన బిరుదు. చదువును లాల్ బహదూర్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. పుస్తకాలు చదవడం ఆయనకు బాగా ఇష్టం. జైలులోనే ఆయన కాంటే, హెగెల్, లాస్కీ, రస్సల్ మొదలైన ప్రసిద్ధ రచయితల గ్రంధాలను మరియు కమ్యూనిస్టు సాహిత్యాన్ని కూడా చదివేవారు. జైల్లో వుండగానే మేడమ్ క్యూరీ జీవిత చరిత్రను ఆయన హిందీలోకి అనువదించారు. బడిలో చదువుకునే రోజుల్లో లాల్ బహదూర్ వేషాలేసేవారు, మహాభారత కధను నాటకమాడినప్పుడు లాల్ బహదూర్ కృపాచార్యుని పాత్రను ధరించాడు. లాల్ బహదూర్ స్కౌట్ ఉద్యమంపై కూడా శ్రద్ధచూపాడు.

1921 జనవరిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి కొందరు జాతీయ భావాలుగల అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆచార్య జీవన్ రావ్ భగవాన్ దాస్, కపలానీ అందులో ఒకరు. స్వరాజ్య పోరాటంలో పాల్గొనమని పెద్ద ఊరేగింపు జరిపారు. లాల్ బహదూర్, త్రిభువన్ నారాయణ సింగ్, అల్లురాయ్ శాస్త్రి మరి ముగ్గురు విద్యార్ధులు హరిశ్చంద్ర హైస్కూలు నుంచి బయటికొచ్చి ఊరేగింపులో చేరిపోయారు. గోపాలకష్ణ గోఖలే, బిపిన్ చంద్రపాల్, సురేంద్ర బెనర్జీ, బాలగంగాధర తిలక్ మొదలైన నాయకుల ఉపన్యాసాలవలన లాల్ బహదూర్ ఉత్తేజితులైనారు.

1927లో లాల్ బహదూర్ మీర్జాపూర్ కు చెందిన లలితాదేవిని పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు పెళ్లికట్నంగా ముట్టినది ఒక రాట్నం, కొన్ని గజాల ఖద్దరు. లాల్ బహదూర్ అంతకుమించి తీసుకొనుటకు ఇష్టపడలేదు. డీ.ఆర్.మాన్కేకర్ లాల్ బహదూర్ శాస్త్రిపై వ్రాసిన పుస్తకంలో శాస్త్రి వ్యక్తిత్వం గురించి ఇలా అంటారు. "పొరపాటు పడితే తక్షణమే క్షమాపణ చెపుతారు. ప్రత్యేకంగా ప్రతి వ్యక్తితోనూ మాట్లాడతారు. గోవింద వల్లభ్ పంత్ వలె జనతా దర్శనం ఇవ్వకుండా ఒక్కొక్కరితో మాట్లాడి గుమ్మందాకా సాగనంపుతారు. తన పాదాలను ఎవ్వర్నీ పట్టుకోనివ్వరు. అఖిల భారత కాంగ్రెస్ సంఘ సమావేశంలో ఆయనెప్పుడో కాని వేదిక మీద కూర్చోరు."

ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త, 1961-66 మధ్య న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి ప్రొఫెసర్ గాల్ బైయిత్ లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇలా అన్నారు- "ఆయన పైకి కనబడినంత మెత్తవారు కాదు. ఆయన మనస్సులో ఉక్కుదనం చాలా వుంది. ఆయన అందరి అభిప్రాయాలను శ్రద్ధగా వింటారు. తరవాత తనొక దృఢమైన నిశ్చయానికి వచ్చాక దానిని మార్చరు."

లాల్ బహదూర్ గాంధేయవాదిగా నిరాడంబర జీవితం గడిపారు. మంత్రిగా వున్నప్పుడు తన హూదాను కూడా మరిచిపోయేవారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ మంత్రిగా వున్నప్పుడు తన నియోజకవర్గం నుంచి కొందరు తనని చూడటానికి వచ్చారు. అప్పుడు లాల్ బహదూర్ ప్రభుత్వ పనిలో నిమగ్నమైయున్నారు. వచ్చినవారు కాసేపు ఎదురుచూసి వెళ్ళిపోయారు. ఇది తెలిసి లాల్ బహదూర్ చాలా బాధపడ్డారు. బస్టాండుకి నడిచి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారు.

విలాస జీవితం లాల్ బహదూర్ కు నచ్చేది కాదు. ఉత్తరప్రదేశ్ మంత్రి అయినప్పుడు తన ఇంటిలో ఒక గది ప్రభుత్వం తరపున ఎయిర్ కండిషన్ చేయబడింది. ఇది తెలిసిన లాల్ బహదూర్ ఎయిర్ కండిషన్ తీయించేశారట. మంత్రిగా లేనప్పుడు ఇది ఎక్కడనుండి వస్తుంది? సుఖపడటానికి అలవాటుపడితే తిరిగి కష్టపడలేము అని ఆయన వాదించారట. 1956లో అరియలూర్ లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి ఆయన రైల్వే మంత్రిత్వానికి రాజీనామా చేశారు. ఆ ప్రమాదంలో 144 మంది మరణించారు. అయితే, నెహ్రూ లాల్ బహదూర్ రాజీనామాను అంగీకరించలేదు. కళంకిత వ్యక్తులు రాజకీయ పదవులలో వుండకూడదని లాల్ బహదూర్ గట్టిగా నమ్మారు.

1965 ఏప్రిల్ నెల చివరలో కచ్ లోని రణ్ ప్రాంతంపై పాకిస్తాన్ దురాక్రమణ జరిపింది. మన దేశ గౌరవానికి భంగం రానివిధంగా బ్రిటీష్ ప్రధానమంత్రి రాజీ ప్రతిపాదనలు చేస్తే లాల్ బహదూర్ వెంటనే అమోదించారు. అయితే, కచ్ సంధి ఒప్పందాలు పూర్తికాకుండానే పాకిస్తాన్ ముందుగా సాయుధ దుండగులను, ఆ తర్వాత సైన్యాన్ని కాశ్మీర్ సరిహద్ధులకు పంపించి దురాక్రమణ చేసింది. దేశమంతా ఒక్కటై పాక్ దురాక్రమణను త్రిప్పికొట్టాలని ప్రజలకు "జై జవాన్ జై కిసాన్" అని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన అతి దృఢవైఖరి ప్రశంసనీయం. కాలవ్యవధి చేయకుండా భారత సైన్యాన్ని లాహోర్, సియోల్ కోట రంగాలలో పురోగమించవలసిందిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ రెండు రంగాలలో మన సైన్యం రణభేరి మ్రోగించింది. ఇది పాక్ కు ఒక గుణపాఠం, అప్పటి రష్యా ప్రధాని కోసిగిన్ జోక్యం చేసుకొని శాంతి చర్చలకై మధ్య ఆసియా రిపబ్లిక్ ఉజ్చెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ రావలసినదిగా ఉభయ నాయకులను ఆహ్వానించడం జరిగింది. శాంతి చర్చలు ఫలించినప్పటికీ 1966 జనవరి 11న తాష్కెంట్ లోనే లాల్ బహదూర్ గుండెపోటుతో మరణించారు. యుద్ధంలో పైచేయి వున్నా మనదేశం శాంతినే కోరుకుంటుందని ప్రపంచానికి చాటిన ఘనత లాల్ బహదూర్ దే. వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు.

2008/09/09

చిన్న వయసు మేధావి



భౌతికశాస్త్ర చరిత్రను మలుపుతిప్పిన మహాశాస్త్రవేత్తల్లో జర్మనీకి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్-ప్లాంక్ (1858-1947) ఒకరు. ఈయన ఆవిష్కరించిన క్వాంటం సిద్దాంతం ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. అటువంటి ప్లాంక్ జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన ఇది. ప్లాంక్ చాలా చిన్నవయస్సులోనే మేధావిగా గుర్తింపు పొందారు. కీల్ (జర్మనీ) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరేప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్లే. కొత్తవాళ్లెవరైనా చూస్తే... ఆయన అక్కడ అధ్యాపకుడంటే నమ్మేవారు కాదు. ఒకసారి విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దానిలో ప్లాంక్ ఉపన్యసించాల్సి ఉంది. దానికి హాజరు కావటానికి హడావిడిగా బయలుదేరారు. అయితే, ఆ తొందరలో సదస్సు జరిగే హాలు ఎక్కడుందో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. దానితో అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని పట్టుకొని.. "మాక్స్-ప్లాంక్ ఉపన్యసించే సదస్సు ఏ హాల్లో జరుగుతుంది?" అని ప్రశ్నించారు. ఆ కొత్తవ్యక్తికి ప్లాంక్ సిద్ధాంతాల గురించి తెలుసుగానీ.. ఆయనను స్వయంగా ఎప్పుడూ చూడలేదు. దానితో ప్లాంక్ ను ఎగాదిగా చూస్తూ.. "నీకు అక్కడేం పని? ఆ మేధావి ప్రసంగాన్ని అర్ధం చేసుకునే వయసు కాదు నీది!" అన్నారు. వస్తున్న నవ్వును ఆపుకొని మాక్స్-ప్లాంక్ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి.. తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకొని సదస్సు జరిగే హాలువైపు తీసుకెళ్లాడు ప్లాంక్ ను.

చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా బ్లాగులో ఈ టపా రాస్తున్నాను. ఈమధ్య నాకు మాక్స్-ప్లాంక్ ల్యాబరేటరీ ఇచ్చిన పీహెచ్.డీ. డిగ్రీ చేతపట్టుకొని టోక్యో విశ్వవిద్యాలయంలో చేరేసరికి ఇన్ని రోజులు అయినది. నా టపా కోసం ఎదురుచూసిన వారికి ధన్యవాదాలు.

2008/03/14

ఐన్‌స్టీన్ విజయరహస్యం

ఐన్‌స్టీన్ జయంతి సందర్భంగా, ఐన్‌స్టీన్ విజయసూత్రం. ఒకే ఏడాదిలో (1905 లో) ఐదు పరిశోధన పత్రాలను వరుసగా ప్రచురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (మార్చి 14, 1879 - ఏప్రిల్ 18, 1955) సైన్స్ చరిత్రలో తన శకాన్ని ప్రారంభించారు. అవి ఒక్కోటి ఒక నోబెల్ బహామతిని సాధించి పెట్టే స్ధాయి ఉన్నావని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాతి గాంచిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ఈ ఐదింటిలోనిదే. ఈ మహాశాస్త్రవేత్త శాస్త్ర సమస్యల పైనే కాదు, సమకాలిన సామాజిక సమస్యలకూ చురుకుగా స్పందించే వారు. అనేక ఉద్యమాల్లో అగ్రభాగాన ఉండేవారు. దాంతో పలు రంగాలకు చెందిన వ్యక్తులతో ఆయనకు మంచి పరిచయాలు ఉండేవి. రోజూ బోలెడుమంది ఐన్‌స్టీన్ ను కలవటానికి వచ్చేవారు. వారిలో ప్రముఖ శాస్త్రవేత్తల దగ్గరి నుంచి చిట్టిపొట్టి ప్రశ్నలడిగే చిన్నారులూ ఉండేవారు. ఒకనాడు ఒక యువకుడు వచ్చాడు. అవీ ఇవీ మాట్లాడాక, సీరియస్ గా ముఖం పెట్టి "జీవితంలో విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి? ఆ రహస్యం ఏమిటి?" అని ప్రశ్నించాడు. దానికి ఐన్‌స్టీన్ చిరునవ్వుతో, "A=X+Y+Z సూత్రాన్నిఆచరించటమే" అన్నారు. E=mc2 సూత్రమే తప్ప ఈ కొత్త సమీకరణం గురించి తెలియని యువకుడు తెల్లమొఖం వేసి అదేమిటండీ అని ప్రశ్నించాడు. ఐన్‌స్టీన్ బదులిస్తూ "A అంటే విజయం, X అంటే శ్రమించటం, Y అంటే ఉత్సాహంగా ఉండటం, Z అంటే అతిగా మాట్లాడకపోవటం." అని వివరించారు. ఆ కొత్త సూత్రాన్ని ఆ క్షణం నుంచే పాటిస్తూ... ఇక ప్రశ్నలేమీ అడగకుండా ఆ యువకుడు సెలవు తీసుకున్నాడు.

2008/02/23

తెలియని మహత్యం!



"కాశి పట్నం చూడరబాబు... చూడరబాబు" అంటూ జాతర్లలో 'బయోస్కోపు'ల వాళ్లు పాడటం ఇప్పుడు అందరూ మరచిపోయారు. ఈ బయోస్కోపు, శాస్త్ర పరిభాషలో 'కలైడోస్కోప్' ను కనుక్కున్న వ్యక్తి బ్రిటన్ చెందిన ఖగోళ శాస్త్రవేత్త డేవిడ్ బ్రూస్టర్ (1781-1868). సరదా కోసం మొదలు పెట్టి ఆవిష్కరించినా.. కలైడోస్కోప్ ఆ కాలంలో సూపర్ హిట్ అయింది. బ్రూస్టర్ దీని ఆవిష్కరణకు సంబంధించి పేటెంట్ కుడా పొందారు. కాని నిర్మించడం చాలా సులువు కావడం వల్ల బ్రూస్టర్ ప్రమేయం లేకుండా ఈ కలైడోస్కోపులు యూరప్ మొత్తం విస్తరించాయి. బాగా ప్రాచుర్యం పొందిన తరువాత గాని బ్రూస్టర్ కు తన ఆవిష్కరణ మహత్యమేమిటో తెలియలేదు!

2008/02/17

మన దగ్గరకు వచ్చిన సాంకేతిక చైతన్యం 'సైన్స్ ఎక్స్ ప్రెస్'



శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువకులకు ఆసక్తిని పెపొందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వినూత్న రైలు ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' ను అక్టోబరు 31న ప్రధాని మన్మోహన్ సింగ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ లు న్యూఢిల్లీలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈరైలు దేశవ్యాప్తంగా 57 నగరాలను చుట్టివస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ 'సైన్స్ ఎక్స్ ప్రెస్' రైలు ఈరోజు మన రాష్ట్రంలోనికి వచ్చింది. ఈనెల 17 నుంచి 19 వరకు విశాఖలో, 20 నుంచి 22 వరకు విజయవాడలో, 23 నుంచి 27 వరకు సికింద్రాబాద్ లో, 28వ తేదీన గుంటూరులోనూ ఆగుతుంది. మర్నాడు మద్రాసు లోని ఎగ్మూర్ కు బయలుదేరి వెళ్తుంది. విద్యార్ధుల్లో సైన్సు పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

జర్మనీలోని సుప్రసిద్ధ సైన్స్ టన్నెల్ ఎగ్జిబిషన్ తరహాలో రూపొందించిన ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధనలకు సంబంధించి 12 అత్యాధునిక విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక విభాగం, భారతీయ రైల్వే, జర్మనీకి చెందిన విద్యాశాఖ, పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ సొసైటీ నిర్మించినది ఈ ప్రత్యేక రైలు. జర్మనీలో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో లభిస్తున్న అవకాశాలను యువకులకు వివరించడం కోసం ఒక ప్రత్యేక బోగీని రూపొందించారు. జర్మనీ రసాయనాల పరిశ్రమ బి.ఎ.ఎస్.ఎఫ్. మరో బోగీని 'కిడ్స్ ల్యాబ్'గా రూపొందించింది. ఇక్కడ విద్యార్ధులు రసాయనిక శాస్త్ర ప్రయోగాలను స్వయంగా నిర్వహించవచ్చు.

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం, రిజిస్ట్రేషన్ చేయించుకోదల్చుకున్న వారు 9849908669 (విశాఖ), 9849908668 (విజయవాడ), 9849908666 (సికింద్రాబాద్) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

2008/02/05

శాస్త్రాభిమానం


మామూలుగా రాజులు, చక్రవర్తులు అనగానే యుద్ధాల్లో మునిగి తేలేవారనో, సుఖాల్లో ఓలలాడేవారనో మనకు అనిపిస్తుంది. చరిత్రలో దీనికి కోకొల్లలుగా సాక్ష్యాలున్నాయి కాబట్టే ఈ అభిప్రాయం స్ధిరపడిపోయింది. అయితే, కొద్దిమంది మాత్రం ఈ జాబితాలోకి ఎక్కరు. వారిలో ఫ్రెంచ్ పాలకుడు నెపోలియన్ (1769-1821) ఒకరు. ఈ ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తికి గణితం అన్నా, సైన్స్ అన్నా విపరీతమైన అభిమానం. ఈ అభిమానానికి తన దేశం, పరదేశం అన్న పరిమితులు కూడా ఉండేవి కావు. ఎక్కడ మంచి ఆవిష్కరణ జరిగినా, మంచి పరిశోధన గ్రంధం వెలువడినా ఆ శాస్త్రవేత్తను, రచయితను ఫ్రాన్స్ కు ఆహ్వానించి, ఆదరించి ఆ అంశంమైన మాట్లాడించుకునేవారు నెపోలియన్. వేర్వేరు భాషల్లో ఉన్న శాస్త్రీయ గ్రందాలను ఫ్రెంచ్ భాషలోకి అనువదింపజేసేవారు.

2008/01/30

మంచి మాట - 23


సత్యం ఒక్కటే మానవ జీవితాన్ని సన్మార్గంలోకి తీసికొనివస్తుంది.
- మహాత్మాగాంధీ

2008/01/26

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, మంచి మాట - 22



బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.

- జవహర్ లాల్ నెహ్రూ

2008/01/19

జార్జ్ 'ఎవరెస్ట్'



ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ అని ఠక్కున చెబుతాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే మాత్రం.. సమాధానం దొరకదు. ఇంతకీ ఈ పర్వతరాజుకు ఆ పేరు ఎలా వచ్చింది? భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని శాస్త్రీయంగా లెక్క గట్టీ పటాలను రూపొందించే ప్రక్రియ ఆంగ్లేయుల పాలనలో తొలిసారిగా మొదలైంది. గ్రేట్ ఆర్క్ అనే సంస్ధకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ సంస్ధ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ (1790-1866) ఆధ్వర్యంలో పనులు మొదలైనాయి. అన్ని ప్రాంతాలను లెక్కిస్తూ.. ఓ పెద్ద పర్వతం దగ్గరికి వచ్చారు. లెక్కలు పూర్తయ్యాక తేలిందేమంటే ప్రపంచంలోనే దాన్ని మించింది లేదని. ఇక పేరు పెట్టటం మిగిలింది. అప్పటికే స్ధానికులు రకరకాల పేర్లతో దానిని పిలుస్తున్నప్పటికీ.. ఆంగ్లేయుల ప్రామాణికంగా ఒక పేరు లేదు. ఈ నేపధ్యంలో.. ఆ పర్వతానికి జార్జ్ ఎవరెస్ట్ పేరుమీదుగా.. మౌంట్ ఎవరెస్ట్ అని పిలవాలని ఒక ఉద్యోగి సూచించారు. అందరూ ఆమోదించటంతో.. ఆ పేరే నిలిచిపోయింది.

2008/01/11

వాళ్లనుకున్నట్లు జరిగి ఉంటే?



"అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న కవి మాటలు ప్రపంచ ప్రసిద్ది చెందిన కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలకు తెలిసినట్టు లేదు. 1897లో ఈ పరిశోధనశాలలో మొట్టమొదటిసారి ఎలక్ట్రాన్ ను నోబెల్ బహుమతి గ్రహీత సర్ జె.జె. ధామస్ (1856-1940) గుర్తించారు. ఆ తరువాత జరిగిన ఓ విందు సమావేశంలో కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలంతా మూకుమ్మడిగా అనుకున్న సంగతేమిటో తెలుసా? "The electron - may it never be of use to anybody" అంటే మేం కనుక్కున్న ఎలక్ట్రాన్ ప్రపంచంలో ఎవరికీ అక్కరకు రాకుండా ఉండుగాకా అని! ఎలక్ట్రాన్ వల్ల ప్రయోజనమేమీ ఉండదని వారు భావించడమే దీనికి కారణం. కానీ ఆ తరువాతికాలంలో ఈ ఎలక్ట్రానే... ప్రవాహంగా మారి విద్యుత్తును... తద్వారా నేటి ఆధునిక జీవితాన్ని ఇచ్చింది!

2008/01/03

మంచి మాట - 21


వేలాది మంది శాస్త్రవేత్తలు.. రకరకాల పరిశోధనలు.. దేశ విదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పర అవగాహనకు సమయం ఆసన్నమైంది. 1914 నుంచి ఏటా ఈ సైన్స్ సంబరాలు దేశంలోని వివిధ యూనివర్శిటీల్లో జరుగుతునే ఉన్నాయి. 1976లో ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక అయిన ఆంధ్రా యూనివర్శిటీ మళ్లీ 31 సంవత్సరాల తరువాత తిరిగి ఈ సమావేశాలకు ఆతిధ్యమిస్తోంది.




మన దేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించినా దాని ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నేను ఆ ప్రగతిని గుర్తిస్తాను.

- మహాత్మాగాంధీ