2008/11/18
మరపురాని ధీర వనిత, శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా...
శ్రీమతి కమల, జవహర్ లాల్ నెహ్రోల సంతానంగా 1917వ సంవత్సరం నవంబరు 19వ తేదీన జన్మించిన ఇందిరాగాంధీ పెద్దయిన పిమ్మట భారతీయుల ఆరాధ్యదైవంగా రూపొందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. స్విట్జర్లాండ్, బెంగాల్ లోని విశ్వభారతి, ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో విద్యనభ్యసించింది. 1938లో అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇందిరాగాంధీ 1941లో భారతదేశపు పూర్తి రాజకీయాలలో ప్రవేశించింది. 1959లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నుకోబడింది. తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచారమంత్రిగా పనిచేసి ఆ శాఖకే వన్నె తెచ్చింది. రేడియో ప్రసారాల నాణ్యతను పెంచే ప్రయత్నం చేసింది. టెలివిజన్ కార్యక్రమాల ప్రాముఖ్యతను గుర్తించిన తొలి నాయకురాలుగా ఈమె విద్యా కార్యక్రమాల కింద కుటుంబ నియంత్రణ పధక అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు.
లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ప్రధానమంత్రి పదవి అధిష్టించి, తొలి మహిళా ప్రధానిగా ఖ్యాతికెక్కింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించింది. కాంగ్రెస్ లోని పెద్దల నెదిరించి స్వతంత్ర అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి వి.వి.గిరిని రంగంలోకి దించి గెలిపించింది. ఇందిరా కాంగ్రెస్ ను స్ధాపించి ఎన్నికలలో తన పార్టీ అఖండ విజయం సాధించేలాచేసి తనదే అసలైన కాంగ్రెస్ పార్టీ అని నిరూపించింది. తర్వాత తన హయాంలో జరిగిన బంగ్లాదేశ్ అవతరణ సందర్భంలో పాకిస్తాన్ తో యుద్ధంలో విజయం సాధించి వీరనారి అనిపించింది. సిక్కింను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇందిరాగాంధీదే! 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖరాన్ లో అమెరికా కన్నుకప్పి అణుపాటవ పరీక్ష చేసి యావత్ ప్రపంచానికి బారత్ సత్తా ఎమిటో చూపినది. అంతేకాదు, దేశంలో పంటల ఉత్పత్తిని పెంచటం ద్వార హరిత విప్లవం సాధించినది. లాల్ బహదూర్ శాస్త్రి పలికిన 'జై జవాన్ జై కిసాన్' మాటలను అచరించి చూపినది.
అధికారం కోల్పోయినప్పుడు కూడా ఈమె ఏమాత్రం జంకలేదు. తిరిగి ఎన్నికలలో మహత్తర విజయంతో ప్రధాని పదవిని అధిరోహించింది. సిక్కులు ప్రత్యేక ఖలిస్ధాన్ కోసం జరిపిన తిరుగుబాటును 'ఆపరేషన్ బ్లూస్టార్' నిర్వహించి సమర్ధవంతంగా అణచివేసింది.
ప్రధానిగా రాజభరణాల రద్ధు, బ్యాంకుల జాతీయం వంటి చర్యలు దేశంలోని పేదవర్గాలనెంతో ఆకర్షించింది. ఆనాడు 'అమ్మ' అంటే ఇందిరాగాంధీయే అని పేద వర్గాలు భావించేవారు. 'గరీబీ హఠావో' నినాదంతో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపింది. 1972వ సంవత్సరం ఈమెకు భారతరత్న అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి జనాభా నియంత్రణ కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించినందులకు ఈమెను 1983లో సత్కరించారు. ప్రతి రాష్ట్రంలోను రవీంద్ర భారతి అను పేర లలితకళల కార్యస్ధాన భవనాలు ఇందిర హయాంలోనే నిర్మించబడ్డాయి.
ప్రజల మనిషిగా పేదవారికి 'అమ్మ'గా వారి హృదయాలలో ప్రతిష్టించబడిన ఇందిరాగాంధీ తన భవనంలో అంగరక్షకులచే తుపాకులతో కాల్చిచంపబడడం దారుణం. ఏది ఏమైనా భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలు.
విభజన:
ఇందిరాగాంధీ,
భారతరత్న,
లాల్ బహదూర్ శాస్త్రి
Subscribe to:
Posts (Atom)