2008/03/14

ఐన్‌స్టీన్ విజయరహస్యం

ఐన్‌స్టీన్ జయంతి సందర్భంగా, ఐన్‌స్టీన్ విజయసూత్రం. ఒకే ఏడాదిలో (1905 లో) ఐదు పరిశోధన పత్రాలను వరుసగా ప్రచురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (మార్చి 14, 1879 - ఏప్రిల్ 18, 1955) సైన్స్ చరిత్రలో తన శకాన్ని ప్రారంభించారు. అవి ఒక్కోటి ఒక నోబెల్ బహామతిని సాధించి పెట్టే స్ధాయి ఉన్నావని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాతి గాంచిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం ఈ ఐదింటిలోనిదే. ఈ మహాశాస్త్రవేత్త శాస్త్ర సమస్యల పైనే కాదు, సమకాలిన సామాజిక సమస్యలకూ చురుకుగా స్పందించే వారు. అనేక ఉద్యమాల్లో అగ్రభాగాన ఉండేవారు. దాంతో పలు రంగాలకు చెందిన వ్యక్తులతో ఆయనకు మంచి పరిచయాలు ఉండేవి. రోజూ బోలెడుమంది ఐన్‌స్టీన్ ను కలవటానికి వచ్చేవారు. వారిలో ప్రముఖ శాస్త్రవేత్తల దగ్గరి నుంచి చిట్టిపొట్టి ప్రశ్నలడిగే చిన్నారులూ ఉండేవారు. ఒకనాడు ఒక యువకుడు వచ్చాడు. అవీ ఇవీ మాట్లాడాక, సీరియస్ గా ముఖం పెట్టి "జీవితంలో విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి? ఆ రహస్యం ఏమిటి?" అని ప్రశ్నించాడు. దానికి ఐన్‌స్టీన్ చిరునవ్వుతో, "A=X+Y+Z సూత్రాన్నిఆచరించటమే" అన్నారు. E=mc2 సూత్రమే తప్ప ఈ కొత్త సమీకరణం గురించి తెలియని యువకుడు తెల్లమొఖం వేసి అదేమిటండీ అని ప్రశ్నించాడు. ఐన్‌స్టీన్ బదులిస్తూ "A అంటే విజయం, X అంటే శ్రమించటం, Y అంటే ఉత్సాహంగా ఉండటం, Z అంటే అతిగా మాట్లాడకపోవటం." అని వివరించారు. ఆ కొత్త సూత్రాన్ని ఆ క్షణం నుంచే పాటిస్తూ... ఇక ప్రశ్నలేమీ అడగకుండా ఆ యువకుడు సెలవు తీసుకున్నాడు.