2007/10/31

ఈ రోజు జాతీయ సమైక్యతా దినం...!


ఈ రోజు జాతీయ సమైక్యతా దినం.. సర్దార్ వల్లభభాయి పటేల్ (1875-1950) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పటేల్ 31.10.1875న గుజరాత్ లో జన్మించాడు. బార్డోలీ సత్యాగ్రహ సమయంలో 1928లో గాంధీజీ పటేల్ ను 'సర్దార్' అని సంబోధించారు. 1931లో కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. సుమారు 540 సంస్ధానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఈయన మొదటి ఉపప్రధానిగా, హోం మంత్రిగా పని చేశారు. 15.12.1950న మరణించాడు. ఈయనకు 'ఉక్కుమనిషి', 'ఇండియన్ బిస్మార్క్' అనే బిరుదులున్నాయి. 1991 లో 'భారతరత్న' ప్రదానం చేసారు.

2007/10/29

మంచి మాట - 15



జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.

- ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్

2007/10/24

నేను చాలా తప్పు చేశాను..!


"నేను చాలా తప్పు చేశాను.. ఆ కణం అసలు ఉనికిలోనే లేదు.. అసలుండదు కూడా. నా అంచనా తప్పు!" - అస్ట్రియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్ గ్యాంగ్ పౌలి (1900-1958) మాటలు ఇవి. ఈ విశ్వంలో.. ద్రవ్యరాశి లేని, ఆవేశం లేని ఒక కణం ఉందని పౌలి 1931లో ప్రతిపాదించారు. అయితే, ఆ కణానికి సంబంధించిన ఆధారాలు మచ్చుకు కూడా కనిపించకపోవటంతో.. తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. ఆ సందర్భంలోనే.. నేను చెప్పింది తప్పు అని బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఆయన అంచనా తప్పుకాదని సైన్స్ నిరూపించింది. పౌలి ప్రతిపాదనను మరింత అభివృద్ధి పరుస్తూ.. ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) ఆ అజ్ఞాత కణాల గురించి మరిన్ని వివరాలు పేర్కొన్నారు. అంతేగాక.. దానికి న్యూట్రినో అన్న పేరు కూడా పెట్టారాయన. అనంతర కాలంలో వివిధ శాస్తవేత్తలు మూడురకాల న్యూట్రినోలను ఆవిష్కరించారు.

2007/10/21

మంచి మాట - 14




మనసు ఎదుగుతున్న కొద్దీ శరీరం దానంతటదే సహకరిస్తుంది. శరీరం సహకరించని నాడు మనసు బాగలేదని అర్ధం.



- సిగ్మండ్ ఫ్రాయిడ్

2007/10/17

యురేకా! ...... మళ్లీ యురేకా!



సైన్స్ చరిత్రలో 'యురేకా' అన్న పదానికి చాలా ప్రాధాన్యత ఉంది. స్నానం చేస్తున్న ఆర్కిమెడిస్ (c. 287 BC – c. 212 BC) బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరవడంతో వంటిమీద బట్టలు కూడా లేని విషయాన్ని చూసుకోకుండా.. వీధిలోకి యురేకా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. యురేకా అంటే.. గ్రీక్ లో నేను కనుక్కున్నానని అర్ధం. వస్తువులు నీళ్లలో ఎందుకు తేలుతాయి అన్న విషయంపై ఆర్కిమెడిస్ పరిశోధనలు నిర్వహిస్తున్న కాలంలో ఈ సంఘటన అందరికీ తెలిసిందే. అయితే, ఆధునిక కాలంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరిగిన విషయమే చాలామందికి తెలియదు. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ వాల్టన్, జాన్ కొక్ రఫ్ట్ 1932లో ఒక యంత్రాన్ని తయారుచేశారు. దీనిద్వారా.. పరమాణువును చేధించవచ్చు. ఈ యంత్రం ద్వారా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు.. వాల్టన్, రఫ్ట్ ఇద్దరూ.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం బయటికి వచ్చి.. యురేకా అంటూ వీధుల్లో ఎగిరి గంతులేశారు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్లను పట్టుకొని.. "మేం పరమాణువును చేధించాం!" అంటూ కేకలు పెట్టారు.

2007/10/15

మంచి మాట - 13, బ్లాగ్ యాక్షన్ డే స్పెషల్


24ఫ్రేములు, 64కళలు బ్లాగ్ చెప్పినట్లు ఈ రోజు బ్లాగ్ యాక్షన్ డే! అంటే ప్రపంచ పర్యావరణం సంరక్షణ కొరకు బ్లాగర్లందరూ గొంతు కలిపిన రోజు. మంచి టపా రాయాలని ఉన్నది కాని సమయం లేదు, అందుకై నా ఈ టపా బ్లాగ్ యాక్షన్ డేకి అంకితం.

Bloggers Unite - Blog Action Day

మానవుడు ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నాడు. అంటే ప్రకృతి అతని శరీరం. అతను మరణించకుండా ఉండాలంటే ప్రకృతితో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి.

-మార్క్స్‌

2007/10/10

నోబెల్ ప్రైజ్ కు ఆవగింజపాటి విలువలేదా?



నోబెల్ ప్రైజ్, డైనమైట్ ను కనుగొన్న స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ ప్రైజ్ లను ప్రదానం చేస్తారు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని రక్తపాత రహితంగా, సత్యాగ్రహం-అహింసలే అయుధాలను చేసుకొని పోరాడిన మహాత్మాగాంధీకి ఇవ్వని నోబెల్ శాంతి బహుమతికి గౌరవం ఉన్నదో లేదో తెలియదు కానీ.. నోబెల్ ప్రైజ్ కు శాస్త్రప్రపంచంలో చాలా గొప్ప గౌరవస్ధానంలో ఉన్నది. ప్రతి శాస్త్రవేత్తా.. దాని కోసం కలలుగంటారు. ప్రైజ్ మాట అటుంచి.. నోబెల్ కమిటీ పరిశీలనకు తన పేరు వచ్చినా గొప్ప గౌరవంగా భావిస్తారు. అయితే, అటువంటి అత్యున్నత పురస్కారానికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆవగింజంత విలువ కూడా ఇవ్వకపోవటం గమనార్హం. 1922లో ఐన్‌స్టీన్ కు నోబెల్ బహుమతి లభించింది. అయినప్పటికీ.. తను రోజూ రాసుకునే డైరీలో గానీ.. తరచుగా మిత్రులకు రాసే ఉత్తరాల్లో గానీ.. ఐన్‌స్టీన్ కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. అంతేకాదు, చాలాసందర్భాల్లో తనకు ఆ ప్రైజ్ వచ్చిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించేవారు కాదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధము కాలంలో ప్రత్యక్ష హింసను చూసిన ఐన్‌స్టీన్, అవకాశం వచ్చినప్పుడు అహింస గురించి, నోబెల్ మాన్(గాంధీజీ) గురించి తప్పక మాటలాడేవారు.

2007 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ సంబరాలు మెదలైనవి, ఇప్పటికే వైద్య(ఆలీవర్ స్మిత్తీస్, మారియో కాపెచ్చి, మార్టిన్ ఇవాన్స్ లకు కలిపి), భౌతిక(అల్బర్ట్ ఫెర్ట్, పీటర్ గ్రూన్ బర్గ్ లకు కలిపి), రసాయన(గెర్హార్డ్ ఎర్టల్) శాస్త్ర విభాగాలకు అవార్డులను ప్రకటించారు (వాటి మర్మ-మరాలు త్యరలో..).

2007/10/07

మంచి మాట - 12



అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.

- స్వామీ వివేకానంద

2007/10/04

కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్





మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా చెప్పిన జగదీశ్ చంద్రబోస్ (1858 - 1937), ప్రపంచ ప్రసిద్ది చెందిన 'ది లివింగ్ అండ్ నాన్ లివింగ్'(1902), 'ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్' (1926) అనే గొప్ప సైన్స్ పుస్తకాలు మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ నవల రచన కూడా చేసేవారు. మొట్ట మొదటి బెంగాలి సైన్స్ ఫిక్షన్ నవల 'నిరుద్దెశేర్ కహిని' (1896) అయన రాసినదే. బోస్ మరియు విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ మంచి స్నేహితులు. మంచి స్నేహం మంచికి నాంది అని, ఇరువురి మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చక్కటి సాహిత్యంతో, కవితలతో ఉండేవి. బోస్ కు కర్ణుడి పాత్ర అంటే చాలా అభిమానం, జాలి కూడా అందుకే ఎలాగైనా కర్ణుడి పాత్రను చిరస్మరణీయం చేయాలని రవీంద్రుడిని కోరారు. ఫలితంగా 'కుంతి-కర్ణ సంవాదం' అనే హృద్యమైన పద్యరచన రవీంద్రుడి కలం నుంచి జాలువారింది.

2007/10/02

మంచి మాట - 11


మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
- మహాత్మాగాంధీ

2007/10/01

మంచి మాట - 10

ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.

-మదర్ థెరిస్సా